Chiranjeevi : ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా ఆగడం లేదు. తొలుత ఈ విషయాన్ని మీడియా కూడా చాలా లైట్‌గానే తీసుకుంది. సరదా సన్నివేశంగానే అభివర్ణించింది. మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంపై ట్వీట్ వేయడంపై టాపిక్ యూ టర్న్ తీసుకుంది. నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. మెగాస్టార్ చిరంజీవి కావాలని గరికపాటి వారిని విస్మరించనూ లేదు.. నిర్లక్ష్యం ప్రదర్శించనూ లేదు. ఇక గరికపాటి అంతటివారు ప్రవచనం చెబుతున్నప్పుడు ఎవ్వరూ వినడం లేదంటే వారికి అసహనం ఉండటం సర్వసాధారణం.
చిరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నది లేదు. ఫోటో సెషన్‌కి గుడ్ బై చెప్పి సైలెంట్‌గా వచ్చి తన ప్లేసులో తాను కూర్చొన్నారు. ఆ తరువాత కూడా వారిద్దరూ చక్కగా మాట్లాడుకున్నారు. కానీ నాగబాబు దీనిపై కాస్త వెటకారంగా ట్వీట్ చేశారు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో పెను దుమారమే రేగింది. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం దీనికి తోడైంది. ఆ తరువాత క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గరికపాటికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. సీన్‌లోకి సినీ నటుడు ఉత్తేజ్ సైతం ఎంటర్ అయ్యాడు. గరికపాటిపై మండిపడ్డారు.
క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గరికపాటికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. ఇంత రచ్చ అవుతున్నా.. మెగాస్టార్ చిరంజీవి స్పందించకపోవడం కాస్త ఆశ్చర్యంగానూ.. ఆసక్తికరంగానూ మారింది. ఈ ట్రోల్స్ ఏంటని ప్రశ్నించిందే లేదు. గరికపాటి అంతటి వారిని క్షమాపణ చెప్పాల్సిందేనని మెగా ఫ్యాన్స్ అంతలా పట్టుబడుతున్నా.. పెదవి విప్పడం లేదు. అంటే తన గురించి గరికపాటి వారు అలా మాట్లాడటం ఆయన కూడా తప్పేనని భావిస్తున్నారా? అందుకే పెదవి విప్పడం లేదేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా మాట్లాడకుండా ఊరుకుంటే మెగా ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయే అవకాశమూ లేకపోలేదు. ఇవన్నీ చిరుకి ఎందుకు పట్టడం లేదు. చిరు ఒక్కసారి మాట్లాడి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని పలువురు కోరుతున్నారు.