దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చిరంజీవిపై కాస్తా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో ఆ కార్యక్రమంలో భాగంగా చాలా మంది ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా గరికపాటి చిరంజీవిపై అసహనం వ్యక్తం చేస్తూ మీ ఫోటో సెషన్ పూర్తయితే నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తానని స్టేజ్ మీదనే అన్నారు. దాంతో చిరంజీవి ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరారు. తరువాత యధావిధిగా ఆ కార్యక్రమం సాగింది. గరికపాటి చిరంజీవి ఉద్దేశించి మాట్లాడిన మాటలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అవి కాస్తా మెగా ఫ్యాన్స్ కి కోపాన్ని తెప్పించాయి. అలాగే మీడియా కూడా ఆ అంశాన్ని పట్టుకొని రచ్చ చేశాయి.
కొంత మంది మెగా ఫ్యాన్స్ అయితే నేరుగా గరికపాటికి ఫోన్ చేసి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో గరికపాటి కూడా మెగా ఫ్యాన్స్ టార్గెట్ తో భయపడి వెనక్కి తగ్గారు. స్టేజ్ మీద తాను మాట్లాడిన మాటలపై విచారణ వ్యక్తం చేశారు. ఏదో తెలియకుండా అలా వచ్చేశాయని, చిరంజీవికి క్షమాపణలు కోరుతున్నా అని చెప్పారు. ఇక నాగబాబు కూడా గరికపాటిపై పరోక్షంగా సెటైర్లు వేశారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు గరికపాటికి మద్దతుగా నిలబడ్డాయి. అయితే ఈ ఇష్యూ మరింత వివాదం కావడం ఇష్టం లేని గరికపాటి తాను నేరుగా చిరంజీవితో మాట్లాడుతా అని తన మాటలపై అతనికి క్షమాపణ చెబుతానని మెగా అభిమానులకి చెప్పారు.
దీంతో కొంత వరకు మెగా ఫ్యాన్స్ శాంతించారు. అయితే ముందుగా మెగా ఫ్యాన్స్ అందరిని నాగబాబు తన ట్విట్టర్ పోస్ట్ తో రెచ్చగొట్టి మరల చివరిగా మీడియాతో మాట్లాడుతూ గరికపాటి నుంచి మేము క్షమాపణలు ఆశించలేదని చెప్పారు. ఆయన ఏదో ఆ సమయంలో అసహనంతో మాట్లాడిన మాటలుగానే మేము పరిగణిస్తామని మెగా ఫ్యాన్స్ ఎవరూ కూడా అతన్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ చెప్పుకొచ్చారు. జరగాల్సిన నష్టం అంతా చేసేసి చివరికి ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ప్రవచన కర్త ఏదో అసహనంతో ఒక మాట అంటే దానిని పట్టుకొని అంతగా అతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా అంటూ మెగా ఫ్యామిలీని వ్యతిరేకించే వారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.