ఆక్సిడెంట్ అవడం వల్ల సులోచన తలకు బలమైన గాయం అవుతుంది. దాంతో వేద, ఆమె తండ్రి.. బంధువులందరూ ఆస్పత్రికి చేరుకుంటారు. తల్లి కండిషన్ ఎలా ఉందంటూ డాక్టర్‌ని అడుగుతుంది వేద. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం అంటూ బ్యాడ్ న్యూస్ చెప్తుంది డాక్టర్. దాంతో అందరూ కంటతడి పెడతారు. ఆ తర్వాత అక్టోబర్ 7 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆస్పత్రికి వచ్చి వేదని ఓదారుస్తుంది మాళిని. మీ అమ్మకి ఏం కాదంటూ ధైర్యం చెబుతుంది కోడలికి. డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేశామని.. బలమైన గాయం వల్ల బ్రెయిన్ షాకైందని చెప్తుంది. తను కూడా డాక్టర్‌నేనంటూ మాట్లాడి తల్లి కండిషన్ ఎలా ఉందో చెప్పమని వేడుకుంటుంది వేద. 24 గంటల్లో తను స్పృహలోకి రాకపోతే కోమాల్లోకి వెళ్లే అవకాశం ఉందని విషయం చెప్తుంది డాక్టర్. ఆ తర్వాత ఖుషీ దేవుడి ఫొటోల దగ్గరకు వెళ్లి.. ‘మా అమ్మమ్మ చాలా మంచిది. తను త్వరగా కోలుకోవాలి. ప్లీజ్ దేవుడా’ అంటూ భగవంతుడిని ప్రార్థిస్తుంది. మరోవైపు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి సులోచనని కలుస్తారు. డాక్టర్లతో మాట్లాడి పేషెంట్ కండిషన్ అడిగి తెలుసుకుంటారు. వేద పోలీసులను ఈ ఆక్సిడెంట్ ఎలా అయింది అని అడగ్గా.. ఈ కేసులో పేషెంట్ తప్పేం లేదు. ఎవరో ఒక వ్యక్తి ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడం వల్ల ఇది జరిగింది అంటూ వెల్లడిస్తారు. అలా చేసిందెవరో తెలిసిందా అని వేద అడగ్గా.. అక్కడ సీసీటీవీ లేకపోవడం వల్ల ఎవరో తెలుసుకోలేకపోయాం.. కానీ ఐ విట్‌నెస్ పేషెంట్ ముందుంచితే కచ్చితంగా ఆక్సిడెంట్ చేసిందెవరో తెలుసుకోవచ్చు అంటారు పోలీసులు. ఆక్సిడెంట్ చేసిన వాళ్లని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదంటూ పోలీసులకు ఆర్డర్ వేస్తాడు యశోదర్. అవసరమైతే మీ డీజీపీతో మాట్లాడతానంటాడు. పేషెంట్ వాంగ్మూలం చాలా అవసరమని.. తను చెప్పేదాన్ని బట్టి కేసు వేద్దామని అంటారు పోలీసులు.

మా అమ్మకి ఇలా జరగడానికి కారణమైన నిన్ను అసలు వదలనురా దుర్మార్గుడా.. అంటూ తిడుతుంది వేద. భర్తతో ఎలాగైనా వాడిని పట్టుకొని శిక్షించమని వేడుకుంటుంది. ఆక్సిడెంట్ చేసిన వాడిని అస్సలు వదిలిపెట్టనని వేదకు మాటిస్తాడు యశ్. ఆ తర్వాత సీన్‌లో కైలాష్ కారు తీసుకుని గ్యారెజ్‌కు వెళ్తాడు. కారు రిపేర్ చేయమని అడుగుతాడు. నాలుగురోజుల్లో కారు ఇస్తానని.. ఆక్సిడెంట్ చేసిన మీ కారు పోలీసులకు దొరకదని అంటాడు అక్కడి వర్కర్. దాంతో కైలాష్ కారు కీస్ ఇచ్చి వెళ్లిపోతాడు.
సీన్ కట్ చేస్తే.. వేద తన తల్లి సులోచన దగ్గరికి వెళ్లి ‘నువ్ నాకు కావాలమ్మా.. లేమ్మా..’ అంటూ గుండెలవిసేలా రోదిస్తుంది. యశ్ వచ్చి భార్యని ఓదారుస్తాడు. ‘సులోచన.. మన పెళ్లైన ముప్ఫై ఏళ్ల నుంచి నిన్ను ఏ రోజు ఇలా చూడలేదు.. లే సులోచన.. కళ్లు తెరువు’ అంటూ ఎమోషనల్ అవుతాడు వరదరాజు. అంతలోనే డాక్టర్ వచ్చి ఇంత మంది ఇక్కడే ఉంటే పేషెంట్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది వెళ్లిపోమని చెబుతుంది. ‘మా అమ్మ కండిషన్ ఎలా ఉంది.. ఏదైనా బెటర్‌మెంట్ కనిపిస్తుందా’ అంటూ డాక్టర్‌ని ఆరా తీస్తుంది వేద. తను ఇంకా స్పృహలోకి రావడం లేదని.. అలా ఆలస్యమైతే కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్తుంది డాక్టర్. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. తను స్పృహలోకి రాదనిపిస్తుంది. అలా జరగాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. అది ఎలా జరుగుతుందో ఏమో అంతా ఆ దేవుడి దయ అంటుంది డాక్టర్.
డాక్టర్ అన్న ఆ మాటలకు మాళిని పరుగెత్తుకుంటూ సులోచన దగ్గరకు వస్తుంది. ‘ఏయ్ సులోచన లే. నువ్ ఇట్ల పడుకుంటే ఎట్ల. నేను ఎవరితో పోట్లాడాలి. నాకు బోర్ కొట్టదా. నీ ఇడ్లి సాంబార్ ఎవడికి కావాలి. మర్యాదగా నువ్ కళ్లు తెరవకపోతే నీ కూతురి చేతే నాన్ వెజ్ వండించి తినిపిస్తా’ అంటుంది మాళిని. పేషెంట్‌కు ఏం వినిపించదని నర్సు చెప్పినా నేను మాట్లాడేది వినిపిస్తుందంటూ బెట్టు చేస్తుంది మాళిని. ‘నేను గయ్యాడి గంపనంటావ్ కదా. నీ కూతురిని రాచి రంపాన పెడతా’ అంటూ వేదని ఏడ్పిస్తుంది. సులోచనకు పౌరుషం కలిగేలా మాటలంటుంది మాళిని. ‘పండితారాధ్యుల సులోచన. నేను ఒప్పుకుంటా. మా మళబార్ కంటే నీ అగ్రహారమే గొప్ప. నువ్ నా బుజ్జివి కదూ. కళ్లు తెరువు సులోచన’ అంటూ బతిలాడుతుంది. ఏయ్ సులోచన నాకు భరతనాట్యం రాదంటావ్ కదా. ఇపుడు చేస్తాను చూడు అంటూ ఏడుస్తూ డ్యాన్స్ వేస్తుంది మాళిని. అది చూసి అక్కడున్న వారందరి గుండెలు బరువెక్కి పోతాయ్. అంతలోనే సులోచన తన చేయిని కదిలిస్తుంది. అది చూసి వేద ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..