పాపని తాకడంతో తనకి షాక్ కొట్టిన విషయాన్ని కొడుకు వల్లభకు చెబుతుంది తిలోత్తమ. దాంతో మరొక్కసారి చెక్ చేసుకోమని ఉచిత సలహా ఇస్తాడు కొడుకు, కోడలు. దాంతో మళ్లీ వెళ్లి పాప చేతిని తాకుతుంది తిలోత్తమ. ఈసారికి షాక్ కొట్టదు కానీ జారి కిందపడుతుంది. దాంతో మళ్లీ పెద్దగా అరుస్తుంది. మరోవైపు నయని మాత్రం పిల్లలతో సంతోషంగా గడుపుతుంది. భర్త తన భార్య, బిడ్డకు దిష్టి తీసేస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 6 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
నయని తన భర్త విశాల్ మీద ఫిర్యాదు రాస్తున్నాని చెప్పి ఆటపట్టిస్తుంది. కానీ పిల్లలకు కావాల్సిన లిస్టు రాసి పెట్టి తీసుకురమ్మని చెప్తుంది. పైసలు ఇవ్వమని అడగ్గా.. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. చాలా రోజుల తర్వాత మనం సంతోషంగా నవ్వుకున్నామని విష్ చెప్పగా.. పిల్లల వల్లే ఇదంతా జరుగుతుంది అంటుంది నయని. పండగ తర్వాత సుమన వాళ్ల అమ్మ వాళ్లింటికి వెళ్లిపోతారు అంటూ బాధపడతాడు విశాల్. కానీ నయని మాత్రం భర్తకు ధైర్యం చెబుతుంది. తన భార్యని చూసి గర్వపడతాడు విశాల్ బాబు.
సీన్ కట్ చేస్తే.. తన భర్తని ల్యాప్ టాప్ ఇవ్వమని వెంటపడుతుంది సుమన. ఎంత బతిలాడిన ల్యాప్ టాప్ ఇవ్వడు గాక ఇవ్వడు విక్రాంత్. దాంతో సుమనకు కాస్త అనుమానం కూడా కలుగుతుంది. చీరలు చూస్తాను.. మరేం చూడను అంటూ భార్య ఎంతగా అడిగినా విక్రాంత్ ల్యాప్ టాప్ ఇవ్వడు. దాంతో భర్త వెంటపడి ల్యాప్ టాప్ లాక్కునే ప్రయత్నం చేస్తుంది సుమన. అపుడే ల్యాప్ టాప్ జారి కిందపడిపోతుంది. ఆ శబ్దానికి అందరూ పరుగున వస్తారు. ఆ ల్యాప్ టాప్‌తో నీకు పనేంటి సుమన అని నయని అడగ్గా.. పట్టుచీరలు కొనడానికి ల్యాప్ టాప్ కావాలంటా అని చెప్తాడు విక్రాంత్. ఆన్‌లైన్ షాపింగ్ కోసం అడుగుతున్నావా అని అడగ్గా.. అదేం కాదు.. ఈయన వెంట ఎంత మంది ఆడవాళ్లు పడుతున్నారో తెలుసుకుందామని అంటుంది సుమన నిస్సందేహంగా. తిలోత్తమ కూడా అడగ్గా.. ఆఫీస్ డేటా ఉందని కవర్ చేసుకుంటాడు విక్రాంత్. ఇలా అయితే మీ ఇద్దరి కాపురం సరిగా ఉండదు. ‘అనుమానం అనే బీజం ఉంటే అసూయ తలెత్తుతుంది. విక్రమ్ ల్యాప్ టాప్ ఇవ్వు’ అంటాడు విశాల్ తన తమ్ముడిని. నయని తీసుకుని విశాల్‌కి ఇవ్వగా అది ఆన్ చేస్తాడు. అందులో ఉన్న డేటా చూస్తే ఏం జరుగుతుందోనని భయపడతాడు విక్రాంత్.
ఆ క్షణం అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. కానీ ల్యాప్ టాప్ మాత్రం ఆన్ కాదు. దాంతో విక్రాంత్ ఊపిరి పీల్చుకుంటాడు. అది రిపేర్ చేస్తే పని చేస్తుందని చెప్తాడు విష్. ‘చెల్లీ.. బాగు చేశాకా నిన్ను పిలిచి అందులో ఏముందో చూపిస్తాడు బావగారు’ అంటుంది నయని. విశాల్ ల్యాప్ టాప్ తీసుకుని తన గదికి వెళ్తాడు. తిలోత్తమ కూడా అందులో ఏముందో చెప్పరా అని విక్రాంత్‌ని నిలదీస్తుంది. ‘ఏమని చెప్పాలి. చెప్తే మీరు ఫీల్ అవరు కదా’ అంటూ.. ఓ ఫేక్ లవ్ స్టోరీ చెప్పి కవర్ చేస్తాడు. దాంతో తిలోత్తమలో అనుమానం పెరుగుతుంది. అక్కడ నయని పిల్లలిద్దరికీ ఒకేసారి పాలు పడుతుంది. అది చూసి విశాల్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. భార్యను సంతానలక్ష్మి అంటూ పొగడతాడు. నయనితో సరదాగా గడుపుతాడు.
నయని గాయత్రిని తలుచుకుంటూ బాధపడుతుంది. బిడ్డల కోసం ఏ తల్లైనా రక్తాన్ని పాలగా మార్చి వాళ్ల కడుపు నింపుతుంది బాబుగారు అంటూ గొప్పగా వివరస్తుంది. ‘నయని నీకు ఒక మాట చెప్పనా. శాస్త్రిగారి మనవరాలికి మా అమ్మగారి పేరు పెట్టారంటే ఎంత సంతోషించానో. మా తమ్ముడు విక్రాంత్ కూడా తన పాపకి గానవి అని పేరు పెట్టాలనుకుంటున్నాడు. వీళ్లిద్దరినీ మన బిడ్డలు అనుకుంటే తప్పేంటి’ అంటాడు భార్యతో. మరి ల్యాప్‌టాప్‌లో ఏముందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..