సినిమాలలో ఎక్కువగా మగవారు హిజ్రా పాత్రలు నటిస్తూ మెప్పిస్తారు. కాంచన సినిమాలో లారెన్స్, శరత్ కుమార్ హిజ్రా పాత్రలలో కనిపించారు. ఆ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ లో కూడా చాలా మంది నటులు ఇలాంటి సాహసం చేశారు. అయితే ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి హిజ్రా పాత్రలో నటించే సాహసం చేయడం విశేషం. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్న మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరో ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తాలి అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
ఈ వెబ్ సిరీస్ లో ఇండియాలో పాపులర్ సోషల్ యాక్టివిస్ట్, ట్రాన్స్ జెండర్ గౌరీ సావంత్ పాత్రను పోషిస్తోంది. ఈమె హిజ్రాలు, టాన్స్ జెండర్స్ హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా బాగా ప్రాచూర్యం సంపాదించింది. ఓ విధంగా చెప్పాలంటే సెలబ్రెటీ ట్రాన్స్ జెండర్, ఆమె నటిగా కూడా తన ప్రస్థానం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆమె నిజ జీవిత కథతోనే ఈ తాలి వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రాన్స్ జెండర్ పాత్రలో సుస్మిత సేన్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.
అచ్చంగా ట్రాన్స్ జెండర్ తరహాలోనే ఆమె లుక్ ఉండటం విశేషం. ఈ ఫస్ట్ లుక్ సందర్భంగా సుస్మితా సేన్ ట్విట్టర్ లో దానిని షేర్ చేసుకుంటూ అందమైన వ్యక్తి జీవితాన్ని అంతే అందంగా చూపిస్తున్నాం. ఆమె పాత్రలో నటించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. ఒక హీరోయిన్ అయ్యి ఉండి ఇలాంటి పాత్రలో చేయడం నిజంగా సాహసం అని చెప్పాలి. ఈ జెనరేషన్ హీరోయిన్స్ ఎవరూ కూడా ఇలాంటి ట్రాన్స్ జెండర్ పాత్రలు చేసే ధైర్యం చేయలేరని చెప్పాలి.