Mrunal : కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా హిందీతో పాటు తెలుగులోనూ పరిచయమైన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఆ తరువాత బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపును అయితే సంపాదించుకోలేక పోయింది. ఇక ‘సీతారామం’ మూవీలో అయితే సీతగా నటించి ఊహించనంత స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. యువరాణిగా.. అదే సమయంలో ఒక సాధారణ మహిళగా అమ్మడి నటన విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. నిజంగా సీత అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేలా ఉంది ఆ సినిమాలో మృణాల్ ఆహార్యం.
అయితే తాజాగా మృణాల్ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అసలు అమ్మడికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చిందట. సుల్తాన్ చిత్రంలో అనుష్క శర్మ పాత్రలో ముందుగా తనే ఎంపికయ్యానని చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం నటనలో శిక్షణ కూడా తీసుకుందట. అంతేకాకుండా ఈ సినిమా కోసం 11 కేజీలు బరువు తగ్గిందట. అదే తనకు చేటు తెచ్చిందని.. మరీ ఎక్కువగా బరువు తగ్గడంతో సినిమా దర్శక నిర్మాతలు తనను పక్కనబెట్టి అనుష్కను తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది.
అనంతరం లవ్ సోనియా అనే సినిమాలో అవకాశం వచ్చిందని.. దానిలో అక్రమ రవాణాకు గురైన చెల్లిని రక్షించుకునే పాత్రలో చేసినట్టు తెలిపింది. దీని కోసం తను సినిమాలో వేశ్యగా మారే సన్నివేశం ఉంటుందట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాలో తన పాత్ర నేచురల్‌గా కనిపించేందుకు గానూ.. రెండు వారాలు వేశ్యా గృహంలో గడిపానని మృణాల్ తెలిపింది. అక్కడి వారి కథలు విన్నాక గుండె చలించిపోయిందని.. ఇక అప్పటి నుంచి ఎప్పుడూ మనసులో వారే మెదిలే వారని.. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి కూడా వెళ్లానని చెప్పింది. ఆ సినిమాలో 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వ్యక్తికి అమ్మే సీన్ ఉంటుంది. అది చేస్తుంటే వారి కథలు కళ్ల ముందు కదలాడి ఏడ్చేసిందట. డైరెక్టర్ ధైర్యం చెప్పడంతో నటించానని మృణాల్ తెలిపింది.