ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి చిత్రంపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కొంత మంది పనికట్టుకొని మరీ మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. బాయ్ కట్ బ్యాచ్ కూడా తమ హడావిడిని కొనసాగిస్తూ బాయ్ కట్ ఆదిపురుష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. వీరిలో కొంతమంది ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని వక్రీకరించారని అంటున్నారు. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్స్ అస్సలు బాగోలేదని అభిప్రాయం కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ బాగున్నా కార్టూన్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నారు. ఇలా గ్రాఫిక్స్ గురించి కామెంట్స్ చేస్తున్న అందరూ కూడా ఆదిపురుష్ టీజర్ ని మొబైల్ లో చూస్తున్నవారే కావడం గమనార్హం. ఇక ఈ ట్రోల్స్ ని దర్శకుడు ఓం రౌత్ కూడా ముందే ఊహించారు.
దానికి కారణం సిల్వర్ స్క్రీన్ పై త్రీడీ ఎఫెక్ట్స్ లో చూడాల్సిన టీజర్ ని మొబైల్ స్క్రీన్స్ లో చూస్తే దాని ఎఫెక్ట్ ఏ మాత్రం తెలియదు. కచ్చితంగా కార్టూన్ బొమ్మలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. దీనికోసమే థియేటర్స్ లో ఈ మూవీ బిగ్ స్క్రీన్ ఫీలింగ్ కోసం ప్రదర్శించారు. అలాగే కొంతమంది సినీ జర్నలిస్టులని పిలిచి ప్రత్యేకంగా వారికి త్రీడీ వెర్షన్ చూపించారు. దానిని చూసిన తర్వాత చాలా మంది తమ నిర్ణయాలని మార్చుకున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇప్పటికి అదే పనిగా ఆదిపురుష్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై ఓం రౌత్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. ఆదిపురుష్ టీజర్ ఫోన్ లో చూడలేనంత పెద్ద చిత్రం అనే విషయాన్ని ముందు అందరూ అర్ధం చేసుకోవాలని చెప్పారు.
ఇప్పటి వరకు వస్తున్న ట్రోలింగ్ తో కొంత భయపడిన సంగతి వాస్తవమే అయినా కూడా వాటిని చూసి నేను ఆశ్చర్యపోలేదు. ఈ టీజర్ ని నేను మొబైల్స్ లో చూడటానికి రిలీజ్ చేయలేదు. కేవలం బిగ్ స్క్రీన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేశాను. దీనిని యుట్యూబ్ లో పెట్టకుండా ఆపడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఎక్కువ మందికి చేరువ కావాలని అలా చేసాం. ఇక సినిమా రిలీజ్ కి వంద రోజుల సమయం ఉంది. అయితే ప్రేక్షకులలో ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనే ఆలోచనతోనే టీజర్ ని లాంచ్ చేసాం.
అలాగే నేను చెబుతున్న కథలో రామాయణం వక్రీకరణ ఎక్కడా లేదు. రామాయణం ప్రజలు ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారో అలానే అలాంటి ఫీలింగ్ తోనే చూస్తారు. మరింత బెటర్ గా ప్రతి ఒక్కరికి రామాయణం కథని చేరువ చేయాలనే ప్రయత్నంలో భాగమే ఆదిపురుష్ దీనిని అందరూ జనవరి 12న సిల్వర్ స్క్రీన్ పై త్రీడీలో చూడటానికి రెడీ అవ్వండి. మీకు కొత్త అనుభూతి కచ్చితంగా దొరుకుతుంది అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆదిపురుష్ టీజర్ పై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ పై ఓం రౌత్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడని చెప్పాలి.