తన ఆత్మహత్యకు కారణం యశోదర్ కాదని చెప్పిన మాళవిక.. ఎందుకు అలా చేసిందో కూడా చెప్తుంది. దాంతో ఒళ్లు మండిపోతుంది యశోదర్‌కి. నీలాంటి ఆడదాన్ని నేనెప్పుడూ చూడలేదంటూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు మాజీ భార్యకు. అంతేకాకుండా తన భార్య వేదశ్విని గురించి గొప్పగా చెబుతాడు. మరోవైపు మాళవిక కొడుకు ఆదికి తనెవరో చెప్పకుండా వేద అన్నం తినిపిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పూజ చేస్తున్న సులోచన దగ్గరికి వెళ్లి మేం గుడికి వెళ్తున్నామని చెప్తుంది వేద అత్త. మీ ముద్దుల కూతురు ఇంకా లేవలేదు మా ఇంటికి కూడా కొంచెం ధూపం వేయమని చెప్తుంది. వేద ఇంకా లేవకపోవడమేంటని నోరెళ్లబెడుతుంది సులోచన. ‘మీ పెంపకం అలా ఉంది. అలాంటి కోడల్ని చేసుకోవడం మా కర్మ’ అని మాటలనేస్తుంది వేద అత్త. అపుడు ఆలోచనలో పడుతుంది సులోచన. కశ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుకుంటుంది మనసులో. అక్కడ వేదేమో ఆది మాటల్ని తలుచుకుంటుంది నిద్రలోనే. ఖుషీ వచ్చి అమ్మా.. అని ఎంత పిలిచినా నిద్రలేవదు. చివరగా ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ‘ఏమైందమ్మా.. ఎందుకు లేవలేదు’ అని ఖుషీ అడగ్గా.. రెండు నిమిషాల్లో రెడీ అయి వస్తానంటూ వెళ్తుంది వేదశ్విని.
సీన్ కట్ చేస్తే.. యశోదర్‌ని వదిలిపెట్టినందుకు అభిమన్యు కోపం నశాళానికి అంటుకుంటుంది. ‘దొరికిన అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టావ్. నీ మాజీ భర్త మీద ప్రేమ తగ్గలేదా’ అంటాడు మాళవికతో. షటప్ అభి అని అరుస్తుంది మాళవిక. ‘పిచ్చి నాకు కాదు. నీకు. వేద ముందు అవమానించాడనే చద్దామనుకున్నావ్ కదా. మరి పోలీసులు వచ్చి అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు’ అంటూ నిలదీస్తాడు. అసలు ఎందుకు బతికావ్ బంగారం నువ్ చస్తే నీ చావుకు కారణం వాడని చెప్పి జైలుకు పంపేవాడిని అంటాడు. ‘అభి ఒకటి చెప్పు.. నువ్ నా మీద ప్రేమతో నన్ను చేరదీశావా లేక యశోదర్ మీద కోపంతోనా’? అని ప్రశ్నిస్తుంది అభిని. రెండూ అని చెప్పి.. కాదు కాదు నీ అందం మీద మోజుతో… యశోదర్ మీద పగతో అంటాడు మళ్లీ. అంటే నువ్ నన్ను లవ్ చేయలేదా.. అంటే నువ్ నన్ను లవ్ చేశావా? అనుకుంటారు ఇద్దరూ. ఇద్దరి మద్య మాటల యుద్ధం నడుస్తుంది.
మాళవిక అంటే పొగరు, అందం ఉండాలి. వేదని నువ్ ఫినిష్ చేయి.. యశోదర్‌ని నేను ఫినిష్ చేస్తా. అపుడు నీ మెడలో తాళి కడతా అంటాడు అభి. వేదని బజార్‌కు ఈడ్చి నీ ఖుషీని నీకు ఇస్తా అని మాటిస్తాడు మాళవికకు. వేదశ్విని కోసం రత్నం ఎదురుచూస్తాడు. ఖుషీ స్కూల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతుంది. కాఫీ కోసం వెళ్లిన వేద ఏదో ఆలోచిస్తూ టీ తీసుకొస్తుంది. వేద అలా ఉండడం చూసి ఏదో అయిందని అడుగుతారు అందరూ. అదేం లేదు అంటూ కవర్ చేస్తుంది వేద. అంతలోనే సులోచన వచ్చి ‘వదినా కొంచెం పప్పు ఇస్తారా’ అంటుంది. నువ్ వచ్చింది ఎందుకో నాకు తెలుసు. ఇంత ఆలస్యమైనా నీ కూతురు నిద్రలేవలేదని చెప్పాను కదా అందుకే ఆరా తీద్దామని వచ్చావనుకుంటా. నీ ముద్దుల కూతురు అక్కడ ఉంది’ అంటూ చూపిస్తుంది మాళిని.
వేద తల్లిని చూసి అమ్మా.. అంటూ ఏడుస్తుంది. ఏమైందమ్మా? నీ బాధ నాకు తెలుసు అంటుంది కూతురితో సులోచన. అభి అన్న మాటలన్నీ సులోచనకు చెప్పి బాధపడుతుంది వేద. రోజురోజుకు ఆ మాళవిక పెట్టే బాధ ఎక్కువైపోతుంది అంటుంది. ఇపుడు ఈ విషయంలో నువ్ ఏ నిర్ణయం తీసుకుంటావ్ చెప్పు? అని ప్రశ్నిస్తుంది కూతురిని. అసలు తప్పు ఎవరిది? నా భర్తని నాకు కాకుండా చేస్తున్నందుకు ఎవరిని నిందించాలి. వెనకాల ఉండి అంతా నడిపిస్తున్న ఆ అభిమన్యును అనాలా? అంటూ కంటతడి పెడుతుంది. నేనే ఎందుకు నష్టపడాలి అంటూ తల్లితో చెప్పుకుంటుంది. దానికి కారణం నువే వేద.. సమస్య నీ చుట్టే ఉంది. పోరాడాల్సిన చోట ఓడిపోతున్నావ్. బలంగా ఉండాల్సిన చోట బలైపోతున్నావ్. తప్పు చేసిన వాళ్లు తలెత్తుకు తిరుగుతున్నారు. కానీ ఏ తప్పు చేయని నువ్వు తలదించుకుని తిరుగుతున్నావ్. అందరి పాపిష్టి కళ్లు నీమీదే పడ్డాయి. ఎందుకంటే వాళ్లు ఓడిపోయిన చోట నువ్ గెలుస్తున్నావ్. అందరి కుట్రలు నీమీదే. నీ వల్లే ఈ రోజు ఖుషీ, యశోదర్ ముఖాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి..’ అంటూ బిడ్డ మనసులో కొండంత ధైర్యం నింపుతుంది సులోచన. సహధర్మ చారి అన్న పదానికి సరైన నిర్వచనం నువ్వేనమ్మా.. అంటూ పొగడుతుంది. అందరూ నిన్ను అణిచివేయాలని చూస్తున్నారు కానీ నీ కన్నతల్లిని నేనుండగా వాళ్ల ఆటలు సాగనీయను. నీకోసం ఎంతదూరమైనా వెళ్తా.. ఎవరితోనైనా పోరాడతా.. అంటూ శపథం చేస్తుంది.
అభిమన్యు కైలాష్‌తో కలిసి యశోదర్‌ని దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తాడు. నీ నుంచి వేదని ఎవరూ కాపాడలేరంటూ మాట్లాడుకుంటుండగా సులోచన మాళవిక.. అంటూ అరుస్తూ వస్తుంది. నువ్ ఎందుకు వచ్చావ్ అనగా.. నా కూతురి జోలికి రావద్దని హెచ్చరిస్తుంది. తులసి మొక్క నా కూతురు.. కలుపు మొక్క నువ్వు అంటూ హేళన చేస్తుంది. ఆత్మహత్య చేసుకోవడమేంటి.. నువ్ ఎప్పుడో చచ్చిపోయావ్ కదా.. అంటూ మాళవికని చెడామడా వాయిస్తుంది సులోచన.