YS SHARMILA: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రజాభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన పథకాలతో ప్రజల ప్రేమానురాగాలను పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఆయన ఫ్యామిలీ పడిన కష్టాలు అందరికీ తెలుసు. మరోవైపు రాష్ట్ర విభనతో తెలుగు ప్రజలు రెండుగా చీలిపోయారు.
ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు పోవడంతో వైసీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం వైఎస్ షర్మిల, విజయమ్మ, భారతి ఎంతో కష్టపడ్డారు. ఇందులో వైఎస్ షర్మిల వారి నాన్న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలపించేలా పాదయాత్రను చేపట్టి అన్నను అధికారంలో కూర్చోబెట్టేందుకు చెమట చిందించింది. ఇక 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది.

ఏం జరిగిందో పూర్తిగా అందరికీ తెలీదు కానీ అనుకోకుండా షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీని స్థాపించింది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండటమే ప్రధాన లక్ష్యంగా షర్మిల మరోసారి పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పాదయాత్రలో భాగంగా ప్రత్యర్థులపై షర్మిల ఒక్కోసారి వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. మెదక్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నోరు పారేసుకుని, అటువైపు నుంచి అదేస్థాయిలో షర్మిల మాటలు పడాల్సి వచ్చింది.
తాజాగా ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానించేలా షర్మిల మాట్లాడారంటూ జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. తనపై అట్రాసిటీ కేసు నమోదు కావడంపై షర్మిల స్పందించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అవినీతిపై ప్రశ్నించానన్నారు. ఇది తప్పా? అని ఆమె నిలదీశారు. అవినీతిపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.