మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రీసెంట్ షెడ్యూల్ లో అతనికి సంబందించిన సీన్స్ కంప్లీట్ అయ్యాయి. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ నడుస్తుందని తెలిసిందే. ఇక శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాబీ సింహ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ నెల ఆఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు నుంచి భావిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. సంక్రాంతి పోటీ నుంచి వాల్తేర్ వీరయ్య తప్పుకున్నాడు అని టాక్. దీనికి కారణం సంక్రాంతి రేసులో రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆదిపురుష్ తో పాటు వారసుడు కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. ఈ నేపధ్యంలో అన్నిటికంటే ఆదిపురుష్ మీద ఎక్కువ బజ్ ఉంటుంది. అయితే వాల్తేర్ వీరయ్య కూడా రిలీజ్ అంటే థియేటర్స్ సమస్య వస్తుంది.
ఈ నేపధ్యంలో అలా పోటీ పడి నష్టపోవడం కంటే తీరిగ్గా సరైన సమయం చూసుకొని ప్రేక్షకుల ముందుకి వస్తే హిట్ కొట్టి కలెక్షన్స్ కూడా భారీగా గైన్ చేయొచ్చు అని భావిస్తున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే సరికి సమయం పడుతుందని, సంక్రాంతి రిలీజ్ అంటే అప్పుడు హడావిడి పడాలని భావించి కాస్తా తీరిగ్గా వేసవి లేదంటే శివరాత్రికి ప్రేక్షకుల ముందుకి రావాలని భావిస్తున్నట్లు బోగట్టా. ఇక చిరంజీవి, మెహర్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భోళా శంకర్ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. వాల్తేర్ వీరయ్య కంటే ముందుగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.