Bigg boss 6: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 నాలుగవ వారం కూడా పూర్తి చేసుకుని ఐదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికి నలుగురు కంటెస్టెంట్స్ హౌస్‌ను వీడారు. తొలివారం ఎలిమినేషన్స్ లేవు. కానీ మలి వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకూ హౌస్ నుంచి షానీ సల్మాన్, అభినయశ్రీ, నేహా, ఆరోహి వెళ్లిపోయారు. ఇక నేడు మళ్లీ ఈ వారానికి సంబంధించిన నామినేషన్స్ కార్యక్రమం జరగనుంది. దాదాపు నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్స్ చూస్తే ప్రేక్షకులకు ఒక క్లారిటీ రావడం ఖాయం.
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్‌లో కింగ్ నాగార్జున వచ్చి అందరి లెక్కలూ సరి చేస్తారన్న విషయం తెలిసిందే. క్లాస్ పీకాల్సిన వారందరికీ పీకేసి.. మెచ్చుకోవాల్సిన వారందరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ ఒక్క కంటెస్టెంట్ మాత్రం క్లాసులకు మినహాయింపు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు… గలాటా గీతూ. మొన్నటి వరకూ నాగ్.. అయిన దానికి.. కాని దానికి గీతూ భజన బాగా చేస్తున్నారని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గీతూపై నాగ్ అక్షింతలు వేయడం ఇకపై చూడలేమేమోనన్న నిర్ణయానికి సైతం వచ్చేశారు. కానీ నిన్న నాగ్ గీతూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి భజనే కాదు.. నాగ్ అవసరమైతే బ్యాండ్ మోగిస్తారని కూడా నిన్నటితో రుజువైంది.
Bigg boss 6: ముందు నువ్వు కూర్చో.. వాళ్లతో మాట్లాడుతున్నా కదా..
చంటి కెమెరా కోసం ఆడుతున్నా అన్నాడని శనివారం రోజున కీర్తి ఆరోపించింది. అసలే చంటిపై పీకల్లోతు కోపంతో ఉన్న గీతూ.. ఈ విషయంలో కీర్తిని మిస్ గైడ్ చేసేసింది. ఇక ఆరోహి ఆగుతుందా? సూర్య తప్ప మిగిలిన వాళ్లంతా ఆమె దృష్టిలో నథింగ్ కదా.. ఆమె కూడా చంటిదే తప్పని తేల్చేసింది. నాగ్ వీడియో చూపించి క్లారిటీ ఇస్తే కానీ వీళ్లకు వెలగలేదు. అయినా తగ్గరే. కీర్తి మళ్లీ అదే పాట అందుకుంది. మధ్యలో గీతూ ఇన్వాల్వ్‌మెంట్.. నాగ్‌కి మండిపోయి ఉంటుంది. ‘ఆగు గీతూ.. ముందు నువ్వు కూర్చో.. వాళ్లతో మాట్లాడుతున్నా కదా.. మధ్యలో ఎప్పుడూ అడ్డుతగులుతుంటావు. ఇది నీకు బాగా అలవాటైపోయింది’ అంటూ అక్షింతలేసి ప్రేక్షకుల కళ్లు చల్లబరిచారు నాగ్.