జానకమ్మకు రాధ సేవలు చేయడం చూసి రామ్మూర్తి చేతులెత్తి నమస్కారం చేస్తాడు. ఏమీ కాని మాకు ఇంత సేవ చేస్తున్న నీ బుుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని అడుగుతాడు. నాకు అవసరమైనపుడు నేనే సాయం చేయమని అడుగుతానని బదులిస్తుంది రాధ. మరోవైపు ఆదిత్య పెద్ద డాక్టర్‌ని తీసుకుని జానకమ్మ ఇంటికి వస్తాడు. జానకిని చెక్ చేసి ట్రీట్‌మెంట్ చేస్తే వారంలో నయమవుతుందని గుడ్ న్యూస్ చెప్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 1 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా? అంటూ జానకిని మెట్ల దగ్గరికి తీసుకెళ్లి మళ్లీ భయపెడతాడు మాధవ్. నేనంత దుర్మార్గుడిని కాదు కానీ రాధని నాకు దూరం చేయాలని చూస్తే వాళ్లు కూడా నీ లాగే వీల్ చైర్‌లో కూర్చోవల్సి వస్తుంది. రాధ నాది.. ఆపాలని చూశారా? అంటూ వేలెత్తి తల్లిని బెదిరిస్తాడు. ఆ తర్వాత సీన్‌లో రాధ పిల్లలకు అన్నం తినిపిస్తుంది. దిగులుగా ఉన్న జానకితో ‘ఏమైంది నానమ్మ అలా ఉన్నావ్.. పెద్ద డాక్టర్ బాగైతుందని చెప్పింది కదా.. ఇంకెందుకు బాధపడుతున్నావ్? నీకు మంచిగ అయిపోతది. నువేం పరేషాన్ కాకు..’ అంటూ ధైర్యం చెబుతారు పిల్లలు. రాధ కూడా డాక్టర్ మంచిగ నయం చేస్తారంటూ జానకమ్మని ఓదారుస్తుంది. మాధవ్ మాత్రం చాటుగా వింటూ.. తల్లికి మాటలు వస్తే ఏం జరుగుతుందోనని ఊహించుకుంటూ కంగారు పడతాడు.
మరుసటి రోజు ఉదయం సత్య ‘ఆంటీ కాఫీ’ అంటూ ఇస్తుంది. ఏంటి సత్యా.. అలా ఉన్నావ్. ఆదిత్య ఆ ఇంటికి వెళ్లింది దేవి కోసం కాదు జానకమ్మ కోసం అంటూ సత్య బాధకు గల కారణాన్ని ఉద్దేశించి చెప్తుంది. అంతలోనే ఆదిత్య అక్కడికి వస్తాడు. ‘రా ఆదిత్య. డాక్టర్ ఏమన్నాడు’ అని అడుగుతుంది దేవుడమ్మ. డాక్టర్ నయం అవుతుందని చెప్పారు కానీ జానకమ్మలో ఇంకా ఏదో ఆందోళన కనిపిస్తుందమ్మా అంటాడు కొడుకు. అలాంటి మంచి మనిషికి అలా కావడం చాలా బాధగా ఉందమ్మా.. అంటాడు. ‘అవును.. రాధ జానకమ్మని ఎలా చూసుకుంటుంది’ అని అడుగుతుంది మళ్లీ. చాలా బాధ్యతగా దగ్గరుండి బాగా చూసుకుంటుందని చెప్తాడు. కానీ సత్య మాత్రం కోపంగా తన బాధ పట్టించుకోవట్లేదనుకుంటూ వెళ్లిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. రాధ జానకిని ఏం ఆలోచిస్తున్నావ్. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావ్. ఊకే పరేషాన్ అవుతున్నావ్. మాట వచ్చేదాకా నిమ్మలంగా ఉండండి అని భరోసా కల్పిస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చేస్తాడు మాధవ్. ‘మా అమ్మ ఏం చెప్పాలో నీకు అర్థం కాకపోయినా నాకు అర్థం అవుతుంది. ఎందుకమ్మా రాధ నువ్ ఇంత కష్టపడుతున్నావ్. నా తలరాత అలాంటిది. నన్ను వదిలేసి మాధవ్‌ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంటుంది’ అని అంటాడు. అంతలోనే రుక్మిణికి ఆదిత్య ఫోన్ చేస్తాడు. ‘జానకమ్మకు పెద్ద డాక్టర్ ట్రీట్‌మెంట్ చేసే పరిస్థితి లేదు. తనకు ఆక్సిడెంట్ అయింది. కోలుకోవడానికి చాలా టైం పడుతుంది’ అని చెప్పేస్తాడు. అయ్యో.. ఇప్పుడు ఎట్ల.. ఏం చేయాలి? ఆ డాక్టర్ త్వరగా నయం అవుతుందని చెప్తే అందరం మస్తు ఖుషీ అయినం.. అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది రాధ. ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు. నేను ఆలోచించి చెప్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు ఆఫీసర్. విషయం తెలిసి ‘అలా జరిగిందా రాధ’ అంటూ బాధగా నటిస్తాడు మాధవ్. అది చూసి తట్టుకోలేని జానకి కోపంతో కొడుకు మీదకు గ్లాస్ విసురుతుంది. ‘డాక్టర్‌కు ఆక్సిడెంట్ అయిందని బాధపడుతున్నావా? ఈ డాక్టర్ కాకపోతే ఇంకొకరు’ అంటూ కవర్ చేసుకుంటాడు మాధవ్. వెళ్తూ వెళ్తూ మాధవ్ చూసిన తీరుకు రాధలో అనుమానం మొదలవుతుంది.
డాక్టర్‌కి అలా జరగడం ఏంట్రా అని దేవుడమ్మ ప్రశ్నిస్తుంది ఆదిత్యని. సత్య మాత్రం జానకమ్మని చూసుకోవడానికి ఆ ఇంట్లో ఇంకెవరూ లేరా.. నువ్ తప్ప ఇంకెవరూ దిక్కు లేరన్నట్లు చేస్తున్నావ్? అంటూ కోపంగా అరుస్తుంది ఆదిత్య మీదకి. షటప్ సత్య.. చదువుకున్నదానివి నువ్ కూడా అలా మాట్లాడతావేంటి. ఆఫీసర్‌గా నేను చెప్తే ఎవరైనా వింటారని అర్థమయ్యేలా చెప్తాడు ఆదిత్య. దేవుడమ్మ కూడా సత్యతో అలా మాట్లాడకూడదని మందలిస్తుంది. ‘ఇలా అనుకుంటున్నాం కాబట్టే ఆదిత్యకు ఇంట్లో పనుల కంటే బయటిపనులే ఎక్కువ అవుతున్నాయి’ అంటూ కోప్పడుతుంది. ‘నీకు ఒక ఇళ్లు ఉంది. అందరికీ సాయం చేస్తూ కూర్చుంటావా?’ అంటూ నిలదీస్తుంది. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుధ్దం నడుస్తుంది. ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య రాధని కలుస్తాడు. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..