Munugode : మునుగోడు ఉప ఎన్నిక విషయానికి వస్తే.. ప్రచారం నుంచి అన్ని విషయాల్లోనూ బీజేపీ ముందున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరారు. ఇక అప్పటి నుంచి కూడా ఆయన తన నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉన్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం మునుగోడు ఉపఎన్నికపై దృష్టి సారించడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి నల్గొండ జిల్లాలో బీజేపీకి ఏమాత్రం పట్టులేదు. అయితే రాజగోపాల్ రెడ్డి చేరికతో బీజేపీకి ఆ జిల్లాలో కాస్త పట్టు దొరికనట్టైంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకుని తద్వారా జిల్లాలో ఖాతా తెరవచ్చని.. ఇక మున్ముందు జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ స్థాయిలో కమిటీలు వేసి మరీ తమ విజయానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూసుకుంటోంది. పైగా టీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదులుకోవడం లేదు.
Munugode : ఇక టీఆర్ఎస్ ఊరుకుంటుందా?
ఇదిలా ఉండగా.. తాజాగా మునుగోడులో బీజేపీ మరింత స్పీడ్ పెంచింది. గ్రామ గ్రామానికి జెట్ స్పీడులో దూసుకుపోతుంది. కారణం ఏంటో అర్ధం కాక విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. నేడు ఈ ఉపఎన్నికపై బీజేపీ ఇన్‌చార్జి సునీల్ బన్సాల్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బీజేపీ అసలు విషయం లీక్ చేసిందని టాక్. మునుగోడు ఉపఎన్నిక త్వరలోనే ఉండబోతోందట. మరీ ముఖ్యంగా గుజరాత్, హిమాచల్ ఎన్నికల కంటే ముందే మునుగోడు ఉపఎన్నిక ఉండే అవకాశం ఉందని.. దీనికి సన్నద్ధమవ్వాలని బీజేపీ ముఖ్య నేతలు తమ కింద నాయకులకు సమాచారం ఇచ్చినట్టు టాక్. మొత్తానికి విషయం లీక్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ ఊరుకుంటుందా? ఇది కూడా జోష్ పెంచే అవకాశం లేకపోలేదు.