దగ్గుబాటి ఫ్యామిలీ లో విక్టరీ వెంకటేష్, రానా బాబాయ్-అబ్బాయ్ అనే సంగతి అందరికి తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి వెండితెరపై కనిపిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా దగ్గుబాటి ఫ్యాన్స్ అయితే ఈ కాంబినేషన్ తెరపై కనిపిస్తే చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కాంబోలో వెండితెరపై సినిమా రాకపోయిన నెట్ ఫ్లిక్స్ మాత్రం వీరిద్దరిని కలిపి ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించింది. రానా నాయుడు టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన టీజర్ ని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో నడిచే క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుందని టీజర్ బట్టి తెలుస్తుంది.
ఇక ఇందులో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇక వెంకటేష్ కూడా వయస్సు మళ్ళిన ఖైదీగా కనిపించాడు. రానా తండ్రిగా వెంకటేష్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఇక రానాని పట్టుకోవడానికి వెంకటేష్ ని పోలీసులు ఎలా వాడుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న వైరం ఏంటి అనే అంశాలని క్లుప్తంగా టీజర్ లో చూపించారు. ఇక రెండు పాత్రల చిత్రణ బట్టి చూస్తుంటే కచ్చితంగా పవర్ ఫుల్ క్రైమ్ సబ్జెక్ట్ గానే కనిపిస్తుంది. వెంకటేష్, రానా ఇప్పటి వరకు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వలేదు. మొదటి సారి వీరిద్దరూ కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ తో అందరిని డిజిటల్ స్క్రీన్ ద్వారా పలకరించబోతున్నారు.
ఇక మాఫియా, రాబరీ, గ్యాంగ్ వార్ ఎలిమెంట్స్ తో ఈ రానా నాయుడు స్టోరీని చూపించబోతున్నారని టీజర్ బట్టి అర్ధమవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ టీజర్ హిందీలో ఉండటంతో తెలుగులో డబ్బింగ్ రూపంలో ప్రేక్షకులకి అందించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ బాబాయ్-అబ్బాయ్ కాంబినేషన్ ఓటీటీలో కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఈ రానా నాయుడు టీజర్ బట్టి అర్ధమవుతుంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి వస్తుందని నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది.