Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి ఒక్క విషయము పరిగణలోకి తీసుకుంటారు. ఏ దిశలో ఏ వస్తువు ఉంటే సానుకూలమైన సంకేతాలు వస్తాయో వాస్తు శాస్త్రంలో కచ్చితంగా పేర్కొన్నారు. అయితే ఇంట్లో నాటాల్సిన మొక్కల విషయంలో కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. మన పెద్దలు సైతం ఇంట్లో ఏమేం మొక్కలు నాటాలో వివరంగా పేర్కొన్నారు.
ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క నాటడం అందరం చూస్తున్నాము. అలాగే ఉసిరి, దానిమ్మ, మామిడి, మల్లె, సన్నజాజి ఇలాంటి మొక్కలను నాటడం అందరికీ తెలిసిందే. అలాగే అందరి ఇంట్లోనూ మనీ ప్లాంట్ మొక్కలను సైతం నాటుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అసలు నిజంగా ఇంట్లో ఏ మొక్క నాటాలి ఏ మొక్క నాటకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ దిక్కులో మొక్కలను నాటకూడదు..!!
వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి ఆగ్నేయ మూలల్లో చెట్లను నాటకూడదు. అలానాటితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. అలాగే పండ్లు పూలు ఇవ్వని మొక్కలను సైతం ఇంట్లో నాటకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే తూర్పు దిక్కులో కూడా మొక్కలను పెంచకూడదు. అయితే తులసి ఉసిరి విషయంలో మాత్రం మినహాయింపు ఉంది. ఈ రెండు మొక్కలను మాత్రం తూర్పు దిక్కులో పెంచుకోవచ్చు. తద్వారా ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు.
ఏ దిక్కులో మొక్కలు నాటాలి…!!
అయితే మొక్కలు నాటడానికి వాస్తుప్రకారం ఉత్తరం, దక్షిణం దిశల్లో అయితే సరిపోతుంది. కానీ ఇంట్లో ముళ్ళు ఉన్న మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు అలా పెంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవహించే ప్రమాదం ఉంది. తద్వారా మానసిక ఒత్తిడి ఇంట్లో గొడవలు ధన నష్టం కలిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక ముళ్ళ మొక్కకు మాత్రం మినహాయింపు ఉంది. నాగజెముడును ఇంట్లో నాటుకోవచ్చు. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. నాగజెముడును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇంటి ఆవరణలో నాగజెముడును నాటుకోవచ్చు.
ఈ చెట్లను ఇంటి ఆవరణలో అస్సలు పెంచకూడదు..!!
అలాగే ఇంటి ఆవరణలో జమ్మి చెట్టును బిల్వ వృక్షాన్ని కూడా పెంచుకోవచ్చు. అయితే రావి చెట్టు, మర్రిచెట్టులను ఎట్టి పరిస్థితులను ఇంటి ఆవరణలో నాటకూడదు. రావి చెట్టు మర్రిచెట్టు ఇంట్లోనాటితే ఆ ఇంట్లో ఇక నివాసయోగ్యం కాకుండా అయిపోతుంది. అందుకే ఈ రెండు వృక్షాలను ఇంట్లో నాటకూడదు. అలాగే వేప చెట్టును కూడా ఇంటి ఆవరణలో నాటకూడదు. ఇక పండ్ల విషయానికొస్తే మామిడి, జామ, దానిమ్మ ఈ మూడు మొక్కలను ఉత్తర దిశలో పెంచడం వల్ల ఇంట్లో సిరి సపదలు తులతూగుతాయి.
ఏ సమయంలో నాటాలో తెలుసుకోండి..!!
ఇక మొక్కలను నాటేందుకు సరైన సమయం కూడా ఎంచుకోవాలి. రాత్రిపూట మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. అలాగే చీకటి పడ్డ తర్వాత పండ్లను ఆకులను ఎట్టి పరిస్థితులను తెంపకూడదు. అలాగే సాయంకాలం సమయంలో చెట్ల కింది భాగంలో కూర్చోకూడదు.
Vastu Tips :
నక్షత్రం ప్రకారం మొక్కలను నాటాల్సి ఉంటుంది. స్వాతి, హస్త, మూల, రోహిణి నక్షత్రాల సమయంలో మొక్కలను నాటాల్సి ఉంటుంది. అప్పుడే వాస్తు ప్రకారం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ విస్తరించే అవకాశం ఉంది.