దీప గతం గుర్తు చేసే ప్రయత్నంలో మూర్చపోతాడు కార్తీక్. లేచిన తర్వాత దీపని గుర్తుపట్టి తదేకంగా చూస్తుంటాడు. అది కార్తీక్‌లో మార్పు గమనించిన మోనిత.. అతనికి గతం గుర్తు రాకుండా ఉండాలంటే వేరే ఊరికి వెళ్లిపోవడమే దారని అనుకుంటుంది. అందుకే భార్యగా తనకి గౌరవం ఇవ్వకుండా వంటలక్కతో పొల్చడంపై గొడవ చేసి ఊరు మారడానికి కార్తీక్‌ని ఒప్పిస్తుంది. అంతేకాకుండా.. డ్రైవర్ శివ ద్వారా ఆ విషయం దీపకి తెలిసేలా చేస్తుంది మోనిత. దీప ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని అనుకుంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 22న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘అమ్మనాన్న కోరికమేరకు సౌర్య బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే సౌర్య దగ్గరికి వెళ్లిపోతున్నాను. దయచేసి నన్ను వెతక్కండి’ అని లెటర్ రాసిపెట్టి వెళ్లిపోతుంది హిమ. అది చదివి కొడుకు, కోడలు అలా దూరమైతే.. మనవరాలిద్దరు ఇలా దూరమయ్యారు అని బాధపడతాడు ఆనందరావు. సౌందర్య పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతాడు.
కార్తీక్, మోనిత కలిసి బాబుని తీసుకుని కారులో ఎక్కడికో వెళుతుంటారు. దీప కూడా మరో కారులో వెనకే ఫాలో అవుతుంటుంది. అది గమనించిన మోనిత.. వాళ్లు వెళ్లే చోటు చూశాక షాక్ అవుతావని అనుకుంటుంది. దీప సైతం వారు ఎక్కడికి వెళుతున్నారని భయపడుతుంది. ఇంకోవైపు.. ఆనందరావు ఫోన్ చేసి సౌందర్యకి కాల్ చేసి హిమ ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం చెబుతాడు. దాంతో అతను కూడా వస్తే అందరిని వెతికిపట్టుకుని తిరిగివెళ్లిపోదామని చెబుతుంది. ఇంతలో మనం అనుకున్న ప్లేసు వచ్చిందని కారు ఆపామంటుంది మోనిత. కారు ఆపిన కార్తీక్‌కి అక్కడ కార్తీక్ బట్టల కొట్టు అని రాసి ఉన్న దుకాణాన్ని చూపించి పెళ్లైన కొత్తలో ఇక్కడ వ్యాపారం చేసేవారమని, తర్వాత ఇప్పుడు ఉంటున్న ఊరికి వెళ్లమని చెబుతుంది. అంతేకాకుండా.. మన బంధువులని చూద్దామంటూ తీసుకువెళుతుంది. అక్కడికి వెళ్లిన వారి చుట్టూ కొందరూ మనుషులు వచ్చి చేరతారు. వాళ్లందరూ వరుసలు పెట్టి కార్తీక్‌ని పిలిచి యోగక్షేమాలు కనుక్కుంటారు. అది చూసి కార్తీక్ కూడా మోనితని తన భార్య అని నమ్మేస్తాడు.
ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న దీపకి మోనిత వేసిన ప్లాన్ అర్థమవుతుంది. దాంతో కార్తీక్ దగ్గరకి వచ్చి ఇదంతా మాయ అని నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ.. ఇంతో అక్కడే ఉన్న సూరమ్మ అనే మహిళ.. వంటలక్క మొగుడు ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ అని, ఈమె మీ ఇంట్లో వంటలు చేసేదని.. కార్తీక్ మీద మోజు పడి అతని వెంటపడుతుందని ఉన్నవి లేనివి కల్పించి చెబుతారు. అది విని దీపని తన వెంటపడొద్దని తిట్టేస్తాడు. ఇంతలో కావేరి అనే ఆవిడ వచ్చి మోనితని, కార్తీక్‌ని పలకరిస్తుంది. అంతేకాకుండా.. దీపని త్వరగా వదిలించుకోమని సలహా ఇచ్చి.. వారిద్దరినీ తన ఇంటికి తీసుకెళుతుంది. అది చూసి కార్తీక్‌కి గతమే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. కొత్త గతాన్నే తయారు చేసిందని కన్నీటి పర్యంతమవుతుంది దీప.
ఇంకోవైపు.. మోనిత ఊరికి వచ్చిన సౌందర్య, ఆనందరావు.. హిమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. హిమ, సౌర్యని కలిసిందో లేదోనని ఎమోషనల్ అవుతుంటారు. దాంతో.. మన కుంటుంబానికి ఏదో శాపం తగిలిందని బాధగా అంటాడు ఆనందరావు. ఇంతలో అక్కడి ఇన్‌స్పెక్టర్ సౌందర్యకి కాల్ చేసిన మోనిత ఫోన్ నెంబర్ ఇస్తాడు. మరోవైపు.. ఇంటికి తిరిగి వచ్చిన కార్తీక్ బట్టల షాపులో పని చేసుకుంటుండగా.. దీపకి జరిగిన అవమానం గురించే ఆలోచిస్తూ సంతోషపడుతుంటుంది దీప. తాను చేసిన పనితో కార్తీక్‌తో మాట్లాడానికి మాత్రమే కాదు.. ముఖం చూపించాలన్న సిగ్గుతో చచ్చిపోతుందని ఆనందపడుతుంది మోనిత. ఇంతలో మోనితకి సౌందర్య ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తిన మోనిత ఎవరనీ అడుగుతుండగా.. కార్తీక్ కిందపడిపోవడం చూసి కార్తీక్ జాగ్రత్త అని అరుస్తుంది. అది విని సౌందర్య అనుమానం వస్తుంది. విషయం ఏంటని అడుగుతుండగానే ఫోన్ కట్ చేస్తుంది మోనిత. దాంతో.. నిజం తెలుసుకోడానికి మోనిత దగ్గరకి బయలు దేరతారు సౌందర్య, ఆనందరావు. మరోవైపు.. వారు వస్తే ఏం చేయాలా అని కంగారు పడుతుంది మోనిత. సౌందర్యకి మోనిత దొరికిపోతుందా.. కార్తీక్ అమ్మనాన్నని కలుసుకుంటారా లేదా తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.