దేవుడమ్మ రాధకు ఫోన్ చేసి చిన్మయిని పంపించమని రిక్వెస్ట్ చేస్తుంది. మాధవేమో రాధని ఎలాగైనా శ్రీశైలం తీసుకెళ్లాలని అనుకుంటాడు. దానికి చిన్మయిని అడ్డుగా పెడతాడు. మాధవ చెప్తున్న అబద్ధాలని, చేస్తున్న పాడు పనులను ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది జానకి. ఆ తర్వాత సెప్టెంబర్ 22 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
బయటికి వెళ్తున్న ఆదిత్యని అడ్డుకుంటుంది సత్య. ఎక్కడికి వెళ్తున్నావని పలువిధాలుగా ప్రశ్నిస్తుంది. ఆఫీసు పనిమీద వెళ్తున్నావా? లేక ఎక్కడికి అని అడుగుతుంది. అంతలోనే వారిద్దరి దగ్గరికి వస్తుంది దేవుడమ్మ. వెళ్తేది ఆఫీసు పనిమీద కాదంటున్నావ్ కద ఆదిత్య.. మరైతే సత్యను కూడా తీసుకెళ్లమని సూచిస్తుంది. దాంతో ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతాడు ఆదిత్య. సత్యని తీసుకెళ్లడం కుదరదని అక్కడి నుంచి వెళ్తాడు. దాంతో సత్య బాధపడుతూ చూశారు కద ఆంటీ.. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పట్లేదు అంటుంది. ఏం పనిమీద వెళ్తున్నాడో మనకు తెలియదు కద వదిలేయ్ సత్య అంటుంది దేవుడమ్మ.
సీన్ కట్ చేస్తే.. రాధ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటుంది. దేవి, చిన్మయిలు బట్టల కోసం పోట్లాడుకుంటారు. అంతలోనే అక్కడికి వస్తారు జానకి, రామ్మూర్తిలు. విషయం ఏంటమ్మా అని అడగ్గా.. నాన్న మమ్మల్ని శ్రీశైలం తీసుకెళ్తున్నాడని చెప్తారు. పండగ వాతావరణం.. బాగా రద్దీగా ఉంటది ఇపుడు వెళ్లడం ఎందుకమ్మా.. తాతయ్య మీ నాన్నతో మాట్లాడతారు కద అంటుంది జానకి. దాంతో అందరూ గదిలోనుంచి బయటికి వెళ్తారు.
ఆదిత్య, రుక్మిణి ఎప్పటిలాగే బయట రహస్యంగా కలుసుకుంటారు. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు.. నాకు కారణం ఏంటో తెలియాలి అని నిలదీస్తాడు ఆదిత్య. దేవిని సత్య అలా అన్నప్పటినుంచి నాకు ఫోన్ మాట్లాడాలంటే ఏదోలా ఉంది. అది అర్థమైన తర్వాత నీతో మాట్లాడాలంటే సత్యవ్వే యాదికొస్తుంది అంటుంది రాధ. నువ్ అలా ఆలోచిస్తే ఎలా రుక్మిణి. నాకే పరాయిదానిలా బతుకుతున్న దేవి గురించి ఆలోచించు అంటాడు ఆదిత్య. మాధవ్ శ్రీశైలం రమ్మంటున్న విషయం చెప్తుంది రాధ. అపుడే అటు నుంచి కారులో వెళ్తుంది జానకి. రాధ ఆఫీసర్ ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది చాటుగా. అప్పుడే జానకికి రాధ భర్త ఆదిత్యే అన్న నిజం తెలిసిపోతుంది.
మాధవ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో మళ్లీ అని భయపడుతుంటాడు ఆదిత్య. జానకేమో రాధ ఇన్ని రోజులు దేవుడమ్మ ఇంటికి రాకపోవడానికి అసలు కారణం ఇదేనా? అని షాకవుతుంది. అంటే దేవి ఆఫీసర్ బిడ్డనా అనుకుంటుంది. అంత పెద్ద కుటుంబం నుంచి రాధ ఎందుకు బయటికి వచ్చిందోనని ఆలోచిస్తుంది. మరోవైపు రామ్మూర్తి వచ్చి శ్రీశైలం ప్రయాణం గురించి మాట్లాడతాడు. ఎన్ని చెప్పినా మాధవ్ వినట్లేదని కోప్పడతాడు. పూలదండల మధ్య రాధ ఫొటో పెట్టుకుని గిటారు వాయిస్తాడు మాధవ్. రాధ మీద తన అభిప్రాయాన్ని మనసులో అనుకుంటుండగా జానకి ఆ మాటలు వింటుంది. ఏం చేయబోతున్నాడోనని కంగారు పడుతుంది. రాధ ఇంట్లో ఉండడం మంచిది కాదని, ఇంటి నుంచి పంపించేయాలని అనుకుంటుంది జానకి.
జానకి రాధను లోపలికి తీసుకెళ్లి నగలన్నీ ఇస్తుంది తనకి. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండదమ్మా. రేపు ఉదయాన్నే దేవిని తీసుకుని ఈ ఇంటికి దూరంగా వెళ్లు అంటుంది కంటతడి పెడుతూ. ఏంది మీరు చెప్పేది అని రాధ అడగ్గా.. ఆ ఆఫీసర్ నీ భర్త అని నాకు తెలుసమ్మా అంటూ బాంబ్ పేల్చుతుంది జానకి. మరి దానిపై రాధ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..