BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ మూడో వారంలో అసలు ఆట మొదలైంది. మొదటి రెండు వారాల కంటే మూడవ వారం కాస్త ఆసక్తికరంగా ఆరంభం అయిందనే చెప్పాలి. హౌస్ లో కంటెస్టెంట్స్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గడిచిన రెండు వారాలు ఎలాంటి ఫర్మామెన్స్ లేదని స్వయంగా హౌస్ లో బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున కూడా ఇదే మాట అన్నారు.
దీంతో మూడో వారం కంటెస్టెంట్స్ తమదైన శైలిలో ముందుకు సాగారు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ అడవిలో ఆట అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో శ్రీహాన్ తన ఆటను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ ఇంట, బయట శ్రీహాన్ పై ఇప్పటి వరకు ఎలాంటి ప్రదర్శన చూపకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే ముద్ర పడింది. దీంతో మంగళవారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో దూకుడు పెంచాడు. కెప్టెన్సీ పోటీలో ఉండాలన్న కోరిక శ్రీహాలన్ ఆట తీరులో బలంగా కనిపిస్తోంది.

అడవిలో ఆట అనే టాస్క్ లో భాగంగా శ్రీహాన్ దొంగల టీంలో ఉన్నాడు. దీంతో పోలీసులను ఎదుర్కొని అడవిలో ఉన్న బొమ్మలను తీసుకునే ప్రయత్నంలో రెండు టీంల మధ్య పోరాటం సాగింది. మీరు పొరపాటు చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు రెండు టీంల సభ్యులు వాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీహాన్ ను ఇనయ వాడు అని సంభోదించింది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది.
దీంతో వాడు వీడు అంటున్నావు ఏంటి అంటూ ఇనయపై శ్రీహాన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇనయ కూడా కాసేపు ఎక్కడా తగ్గలేదు. టాస్క్ లో శ్రీహాన్ పొరపాటు చేస్తున్నాడంటూ వాడు అంటాను తప్పేముంది అంటూ ఇనయ కూడా శ్రీహాన్ తో మాటల యుద్దం చేసింది. కానీ ఇది కాస్త తారాస్థాయికి చేరింది. శ్రీహాన్ కి తోడుగా దొంగల టీంలో ఉన్న రేవంత్ కూడా ఇనయపై ఫైర్ అయ్యారు. దీంతో ఇనయ కాస్త వెనక్కి తగ్గి శ్రీహాన్ కి వాడు అన్నందుకు క్షమాపణ చెప్పింది. దీంతో ఆ గొడవ సర్దుకుంది.