Priyanka Mohan: కథానాయకిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి ప్రియాంక మోహన్. తెలుగు, మలయాళం చిత్రాలలో నటించిన ఈమె ఆ తరువాత కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నటించిన తొలి చిత్రం డాక్టర్. అయితే అమ్మడికి అందం, అభినయం తోడవడంతో అవకాశాలకు కొదువ లేదు. ఈ చిత్రం ఆమెకు సక్సెస్‌తో స్వాగతం పలికింది. ఆ తరువాత అదే హీరోతో రొమాన్స్ చేసిన డాన్ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది.
అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి పెద్దగా సమయం కానప్పటికీ వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. హీరో సూర్యకు జంటగా నటించిన ఎదుర్కుమ్ తుణిందవన్ చిత్రం ఈ అమ్మడిని నిరాశ పరిచిందనే చెప్పాలి. అయినా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రం కూడా ఒకటి. రజినీకాంత్ సరసన సినిమా అంటే మాటలా? కానీ ఈ అమ్మడు ఆ చిత్రాన్ని వదులుకుందని టాక్. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
Priyanka Mohan: ప్రియాంక మోహన్ వదులుకున్న పాత్రలోనే తమన్నా..
కాగా ఈ చిత్రం నుంచి నటి ప్రియాంక మోహన్ వైదొలగినట్లు తాజా సమాచారం. దీని గురించి ఈ భామపై రకరకాల వదంతులు వస్తున్నాయి. డాక్టర్ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర దర్శకుడు నెల్సన్‌తో మనస్పర్థలే ఈ చిత్రాన్ని ఆమె వదులుకోవడానికి కారణమనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. ఇకపోతే ప్రియాంక మోహన్ వదులుకున్న పాత్రలోనే నటి తమన్నా నటించడానికి సిద్ధమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రియాంక మోహన్ కూడా ఈ విషయమై స్పందించలేదు.