Bandla Ganesh : కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మహాకూటమి పోటీ చేస్తే.. ఆ కూటమి తరుఫున ఓ రేంజ్ రెచ్చిపోయి ఇరుకున పడిన విషయమూ తెలిసిందే. ‘డిసెంబర్ 11.. ఉదయం 11 గంటల తరువాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు షార్ప్‌గా పీక తెగే 7’O Clock బ్లేడ్ తీసుకుని రండి.. ఒకవేళ మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్.. రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం’ అంటూ 2018లో మంగమ్మ శపథం చేశారు బండ్ల గణేష్.
అంతే ఆ ఎన్నికల్లో మహాకూటమి ఘోర పరాజయం పాలవడం.. ఇక నెటిజన్లు బండ్ల గణేష్‌కు చుక్కలు చూపించడం చకచకా జరిగిపోయాయి. ‘ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం ఏంటి సార్? అసలు మీరెవరు? అధికారంలోకి రాకపోతే అనడానికి? ఆల్ట్రెడీ ఓటర్లు డిసైడ్ చేసేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జనం 70 నుండి 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. ఇది ఫిక్స్. ఇక్కడ మీకు ఇంకో ట్విస్ట్ చెప్తున్నా వినండి. మాకు 80 సీట్లు రావడమే కాదు. టీఆర్ఎస్‌లో 15 నుండి 20 మంది గెలిస్తే వాళ్లు కూడా మా పార్టీలో చేరుతారంటూ మాట్లాడి ఇరుకున పడ్డారు బండ్ల గణేష్. మొత్తానికి ఆ దెబ్బకు ఇక ఆయన రాజకీయాల జోలికి పోరనే అంతా భావించారు.
Bandla Ganesh : మీ అమూల్యమైన ఓటు నాకే వేయండంటున్న బండ్ల గణేష్
కానీ బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇన్నాళ్లు పాటు పాలిటిక్స్‌కి దూరంగా ఉంటోన్న బండ్ల గణేష్ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో బిజీ కావటానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్‌ని ఎవరేమైనా అంటే కూడా అస్సలు ఊరుకుండటం లేదు. దేవర అంటూ పవన్‌పై వీలున్న ప్రతీసారి బండ్ల తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. డిబేట్స్ పాల్గొని తనదైన స్టైల్లో పొలిటికల్ కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే ఆయన త్వరలోనే హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్‌సీసీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘మీ చేతుల్లో మార్చే శక్తి, అవకాశం ఉంది. ఎఫ్ఎన్‌సీసీ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకే వేయండి’ అంటూ బండ్ల గణేష్ రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ చేశారు.