Nitish Kumar : బీజేపీయేతర కూటమి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. విజయానికి కావల్సిన అస్త్ర శస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుంటోంది. ఈ బీజేపీయేతర కూటమిని ఒక్క తాటిపైకి తీసుకు రావడంలో తెలంగాణ సీఎం కేసీఆర్, జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా యత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నితీశ్ సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని పాట్నాలో ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలేమీ కనిపించడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
బీజేపీయేతర పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు నితీశ్ కుమార్ ఇటీవలే యత్నాలు ముమ్మరం చేశారు. నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి,రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్ఎల్‌డీ నేత చౌతాలా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోనూ చర్చలు జరిపారు. అతి త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఆయన సమావేశం కానున్నారు.నిజానికి నిన్న మొన్నటి వరకూ నితీశ్ బీజేపీతో అంటకాగారు. ఇటీవలే బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపారు. బీహార్‌లో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు. నితీశ్ ప్రతిపాదిస్తున్న బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే కాంగ్రెస్ నేతలను కలవడం మాత్రం కేసీఆర్‌కు పెద్దగా రుచించడం లేదు. కానీ నితీశ్ మాత్రం కాంగ్రెస్‌ను కలుపుకుని పోవాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు.
Nitish Kumar : కాంగ్రెస్ పనైపోయిందన్న కేజ్రీవాల్..
ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసేందుకు కేసీఆర్ మాత్రం వెళ్లడం లేదు. నితీశ్ మాత్రమే వెళ్లి పనులను చక్కబెట్టుకుని రానున్నారు. స్వయంగా బీహార్‌లో ప్రస్తుతమున్న సంకీర్ణ సర్కారులో కాంగ్రెస్ కూడా ఉంది.కేసీఆర్ ఇప్పటికే తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్, కేరళ సీఎం విజయన్, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, బీహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ, ఆర్జేడీ అధినేత లాలూ తదితరులతో సమావేశమై చర్చలు జరిపారు. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్‌ను కలుపుకునేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పనైపోయిందని ఇటీవల కేజ్రీవాల్ చెప్పడమే దీనికి నిదర్శనంగా తెలుస్తోంది.