Viral Video: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోని పశువులను లంకీ చర్మ వ్యాధి (Lumpy skin disease) పట్టి పీడిస్తోంది. దాంతో వేల సంఖ్యలో ఆవులు చనిపోతున్నాయి. అయితే ఈ వ్యాధి ప్రభావం రాజస్థాన్‌లో ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఆవుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మనకు అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తాం? వెంటనే ఆసుపత్రికి గానీ, మెడికల్ షాపుకు గానీ వెళ్లి ట్యాబ్లెట్లు తీసుకుంటాం కదా. రాజస్థాన్‌లో కూడా ఓ ఆవు అచ్చం అలాగే చేస్తోంది. లంకీ చర్మ వ్యాధితో బాధపడుతున్న ఆ ఆవు గత నెల రోజులుగా క్రమం తప్పకుండా మెడికల్ షాపు వద్దకు వెళ్తోంది. అక్కడ యజమాని ఇచ్చిన మాత్రలను తీసుకుంటోంది. ఈ దృశ్యాన్ని కొందరు తమ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
దీనిపై స్పందించిన మెడికల్ షాపు ఓనర్.. లంకీ చర్మ వ్యాధితో బాధపడుతున్న ఆవుకు మంట, దురద ఉందని తెలిపాడు. అది గుర్తించి.. తగిన మాత్రలను జాంగ్రీలో పెట్టి దానికి అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. దాంతో ఆ ఆవు బాధ నుంచి ఉపశమనం పొందిందని చెప్పాడు. అందువల్లే ఆ ఆవు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా వచ్చి మాత్రలు తీసుకుంటుందని వెల్లడించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఆవు మెడికల్ షాప్‌కు వెళ్లడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదండోయ్.. మెడికల్ షాపు యజమానిని ప్రశంసిస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు కూడా పెడుతున్నారు.