ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నందుకు చిన్మయికి జాగ్రత్తలు చెప్తుంది రాధ. దాంతో చిన్మయి నువ్ వెళ్లడానికి కారణం ఇదేనా అమ్మా.. అంటూ పెళ్లి ఫొటో చూపిస్తుంది. అపుడు రాధ తన గతం గురించి చెప్తుంది. ఆదిత్యే తన పెనిమిటని బాంబ్ పేల్చుతుంది. నువ్ మాధవ్ సారు బిడ్డవి అంటూ తన గతాన్ని కూడా చెబుతుంది. ఇక నేను ఇంట్లో నుంచి వెళ్లక తప్పదమ్మా.. అంటూ బాధపడుతుంది రాధ. ఆ తర్వాత సెప్టెంబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
నిజం తెలిసిన తర్వాత చిన్మయి ‘వద్దమ్మా.. నన్ను వదిలేసి వెళ్లొద్దు. ప్లీజ్ అమ్మా.. నువ్ లేకుండా నేను ఉండలేను. కావాలంటే నన్ను కూడా తీసుకెళ్లు’ అంటూ బతిలాడుతుంది రాధని. నేను లేకపోతేనేం అవ్వ, తాత ఉన్నారు కద బిడ్డా అని రాధ ఓదార్చే ప్రయత్నం చేసినా చిన్మయి ఏడుస్తూనే ఉంటుంది. నిన్ను విడిచిపెట్టి పోవడానికి నాకూ మనసు రావట్లేదు. నేను చెప్పింది ఎవరికీ చెప్పనని మాటివ్వమని అడుగుతుంది రాధ చిన్మయిని. సరేనని మాటిస్తుంది. నువ్వూ చెల్లి లేకుండా నేనుండలేనమ్మా అంటూ మళ్లీ రాధని పట్టుకుని ఏడుస్తుంది బిడ్డ.
ఆ తర్వాత సీన్‌లో జానకి రాధ వెళ్లిపోతుందేమోనన్న భయంతో రాత్రంతా మెలకువతోనే ఉంటుంది. తెల్లవారుజామున నిద్ర పట్టడంతో ఓ కునుకు తీస్తుంది. వెంటనే లేచి రాధ గదిలోకి వెళ్లినా తను కనిపించదు. మరోవైపు మాధవ్.. రాధని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంటి గడపదాటనివ్వనని మనసులో అనుకుంటాడు. అంతలోనే జానకి వచ్చి.. అరే మాధవా.. అక్కడ రాధ కనిపించట్లేదని నేను కంగారు పడుతుంటే నువ్వేమో గిటారు వాయిస్తున్నావా అంటుంది. నిన్న తనతో చెప్పిన విషయం మాధవతో చెబుతుంది. అది విని ఒక్కసారి షాక్ అవుతాడు మాధవ. ఏంటి నన్ను బెదిరించడానికి అలా చెప్పిందా.. లేక నిజంగా వెళ్లిపోయిందా.. ఎక్కడికి వెళ్లింది అంటూ ఆలోచనలో పడతాడు మాధవ్.
రాధ, ఆదిత్యలు కలిసి రహస్యంగా మాట్లాడుకుంటారు. చిన్మయి వల్ల తను ఇల్లు వదిలి రావట్లేదని చెబుతుంది పెనిమిటితో. ఇల్లు విడిచి వచ్చినప్పటి నుంచి ఎవరితో చెప్పని నిజం చిన్మయికి చెప్పిన పెనిమిటి అంటుంది. ‘అంటే చిన్మయికి అంతా తెలిసిపోయిందా.. ఆ నిజం జానకి, రామ్మూర్తిలకు చెప్తే ఎలా’ అంటాడు ఆదిత్య. ‘ఎవరికి చెప్పా అని నా మీద ఒట్టేసింది’ అంటుంది రాధ. ఇలా చేస్తే నువ్ ఇక ఇంట్లో నుంచి బయటికి ఎలా వస్తావ్ రుక్మిణి అని ప్రశ్నిస్తాడు పెనిమిటి. చిన్మయిని వదిలి రాలేకపోతున్నానని, దేవిని మాత్రం నీ దగ్గరకు పంపిస్తానని మాటిస్తుంది రుక్కు. తనకు ఏం చేయాలో పాలు పోవట్లేదని కూడా బాధపడుతుంది రుక్కు పెనిమిటితో చెప్తూ.
ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మకు కాఫీ ఇస్తుంది సత్య. ఆదిత్య లేచాడా అని ఆరా తీస్తుంది అత్త కోడల్ని. ఎప్పుడో లేచి బయటికి వెళ్లిపోయాడని చెప్పి బాధపడుతుంది సత్య. ఆదిత్య వల్ల సత్య బాధపడుతుందని గ్రహించిన దేవుడమ్మ కొడుకుతో మాట్లాడాలనుకుంటుంది. అక్కడ జానకేమో రాధ వెళ్లిపోయిందని కంగారుపడుతుంది. అంతలోనే ఇంట్లో దేవి కనిపిస్తుంది. రాధ కూడా బయటి నుంచి వస్తుంది. తను కనిపించకపోతే అల్లాడిపోయామని, నువ్ కనిపించాకే మనసు కుదుటపడిందని చెబుతుంది జానకి. ఏదైనా కష్టం వస్తే తనకు చెప్పమని ఎమోషనల్ అవుతుంది. మాధవ్ మాత్రం రాధని చూసే చూపుల్లో మార్పు ఉండదు.
ఆదిత్య పిల్లలు గురించి చెప్పిన మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది సత్య. అది చూసిన దేవుడమ్మ సత్యను ఏమైందమ్మా అని అడుగుతుంది. ‘మాకు పిల్లలు ఎప్పుడు పుడతారా? మీ అందరి ముఖాల్లో ఆనందం ఎప్పుడు చూస్తానా అని నేను ఎదురు చూస్తుంటే ఆదిత్య ఏమన్నాడో తెలుసా ఆంటి’ అని జరిగిందంతా చెబుతుంది దేవుడమ్మతో. ఆదిత్యలో వచ్చిన మార్పును చూసి మదనపడుతుంది.
కరాటేకు వెళ్లేందుకు దేవీని రెడీ చేస్తుంది రాధ. ‘అమ్మా మా అయ్యోరు అయితే నాకు మంచిగా నేర్పిస్తున్నారు. అందరికన్నా నేనే బుద్దిగా నేర్చుకుంటున్నా అన్నాడు. గీ పొద్దు మాకు బెల్టు టెస్ట్ ఉన్నది’ అని చెబుతుంది దేవి. రాధని చూస్తూ చిన్మయి అక్కడే నిల్చుండిపోతుంది. రాధ నిర్ణయంతో మాధవ్ ఇంట్లో ఏం జరగనుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..