రాధ కోసం ఇల్లంతా వెతుకుతుంది జానకి. అప్పుడే బయటినుంచి వస్తారు రాధ, భాగ్యమ్మలు. ఎక్కడికెళ్లారని అడగ్గా.. భాగ్యమ్మ అద్దె ఇల్లు తీసుకుని ఉండబోతున్నట్లు చెప్పేస్తుంది. అది విని షాకైన జానకి.. ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల్ని అడుగుతుంది రాధని. కానీ రాధ నోరు విప్పదు. మరోవైపు మాధవ్ అంతు తేల్చేందుకు రంగంలోకి దిగుతుంది రాధ. దేవి విషయంలో ఆదిత్యకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
తను వెళ్లిపోయిన తర్వాత ఎలా ఉండాలో అన్నీ నేర్పిస్తుంది రాధ చిన్మయికి. ఎందుకమ్మా.. ఇవన్నీ చెబుతున్నావ్ అని అడుగుతుంది. ‘రేపు దేవిని తీసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా. మళ్లీ రానని చెప్తుంది’ రాధ. ఎక్కడికి వెళ్తావమ్మా.. నువ్ లేకుండా నేను ఉండలేనమ్మా అంటూ ఏడుస్తుంది చిన్మయి. నన్ను వదిలేసి చెల్లిని మాత్రమే ఎందుకు తీసుకెళ్తావమ్మా అంటుంది. నువ్ అడిగే ప్రశ్నలకు నా దగ్గర బదులు లేదంటూ కంటతడి పెడుతుంది రాధ.
తర్వాత సీన్‌లో రాధ చేసిన సపోర్ట్‌ను గుర్తుచేసుకుంటాడు ఆదిత్య. ఎప్పుడూ లేనిది రాధ అలా మాట్లాడిందేంటని ఆలోచిస్తాడు. అంతలోనే సత్య వచ్చి ఆదిత్య ముందు కూర్చుంటుంది. ఇంట్లో నేనున్నాని గుర్తున్నాన ఆదిత్య అంటూ ప్రశ్నిస్తుంది. నేను సంతోషంగా ఉండడానికి కారణం దేవి.. అని ఏదో ఆలోచిస్తూ చెబుతాడు. ఆపు ఆదిత్యా.. అంటూ ఒక్కసారిగా అరుస్తుంది సత్య. నీకు పిల్లలంటే ఇష్టమని తెలుసు కానీ.. అలా అని మమ్మల్ని మరిచిపోతే ఎలా అంటూ ఓ రేంజ్‌లో ఆదిత్యని క్లాస్ పీకుతుంది. కొత్తగా మాట్లాడుతున్నావ్ ఏంటి సత్యా.. దేవి కూడా రుక్మిణి కూతురే కదా అంటూ సర్దిచెబుతాడు ఆదిత్య. ‘అక్క కూతురైనా.. మాధవ్‌కి నచ్చదు కదా. మరి ఎందుకు వెళ్లడం. అయినా వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు అంటూ తిరుగుతున్నావ్ కానీ మనకే పిల్లలుంటే ఈ అవసరం ఉంటుందా? అసలు నీకు మన పిల్లలు కావాలని ఉందా? లేదా?’ అంటూ గట్టిగా అరుస్తుంది. ‘లేదు.. నాకు పిల్లలు అవసరం లేదు. దేవీనే ముఖ్యం నాకు. తను కళ్ల ముందు ఉంటే చాలు’ అని చెప్పి కోపంగా వెళ్తాడు. ఆ మాటలకు సత్య గుండె పగిలిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. రాధ వెళ్లిపోతుందనే విషయం తలుచుకుంటూ బాధపడుతుంది జానకి. తాత దగ్గరికి వెళ్తున్న చిన్మయిని పిలిచి తన దగ్గర పడుకోమంటుంది. లేదు నేను అమ్మ దగ్గరే పడుకుంటా. అమ్మ ఎక్కడ ఉంటే నేనక్కడే ఉంటా అంటుంది చిన్మయి. ‘రాధేమో తెల్లవారితే వెళ్లిపోతుంది. రాధ లేకపోతే చిన్మయి ఉండనంటుంది. అమ్మ కాదు అని తెలియక రాధే ప్రాణంగా బతుకుతున్న చిన్మయికి విషయం తెలిస్తే తట్టుకుంటుందా’ అని మదనపడుతుంది జానకి. బెడ్రూంలో పడుకున్న రామ్మూర్తి దగ్గరికి వెళ్లి చూస్తుంది.
మరోవైపు చిన్మయి మాటల్ని తలచుకుంటూ బాధపడుతుంది రాధ. ఈ ఇల్లు వదిలి పెట్టిపోకపోవడానికి కారణం నువ్వే బిడ్డ. కానీ ఇప్పుడు వెళ్లక తప్పట్లేదు. నన్ను మన్నించు బిడ్డా.. అంటుంది చిన్మయిని ఉద్దేశించి అంటుంది రాధ. ఒళ్లో పడుకున్న చిన్మయి లేచి రాధని చూస్తుంది. ‘ఏమైంది బిడ్డా. పడుకోలేదా. మంచినీళ్లు కావాలా?’ అని తీసుకొచ్చి ఇస్తుంది. నువ్ ఎందుకు ఇంట్లోనుంచి వెళ్లిపోవాలనుకుంటున్నావ్ అమ్మా? దేవీ నేను ఇద్దరం ఒకటే కదా. మరి నన్ను ఎందుకు వద్దనుకుంటున్నావ్..? అని నిలదీస్తుంది రాధని. నువ్ వెళ్లిపోవడానకి కారణం ఇదేనా.. అంటూ పెళ్లి ఫొటోని తీసి చూపిస్తుంది. ఈ ఫోటో ఏంటమ్మా.. నాకేం అర్థం కావట్లేదు. ఆఫీసర్ అంకుల్ కూడా నువ్ తెలుసని చెప్పలేదేంటి. ఇది పెళ్లి ఫోటో కదా ఇక్కడ నువ్ ఉన్నావేంటి ఇక్కడ? అని సూటిగా అడుగుతుంది చిన్మయి.
‘ఈ నిజం నా బిడ్డకు చెప్పాల్సి వస్తుందనుకున్నా కానీ నీకు చెప్తాననుకోలే. ఆఫీసర్ సర్ నా పెనిమిటి. దేవీ నా బిడ్డ. నువ్ మాధవ్ బిడ్డవి’ అంటుంది రాధ. ఏంటమ్మా నువ్ మా అమ్మవి కాదా అని అమాయకంగా ప్రశ్నిస్తుంది చిన్మయి. ‘అలాంటి ఆలోచన నాకెపుడు రాలే. దేవమ్మా ఎంతో నువ్ అంతే. అసలు జరిగిందేంటో చెప్తా’ అంటూ గతం గురించి పూర్తిగా చెబుతుంది రాధ. నీకోసమే ఈ ఇంటికి వచ్చినా. నీకోసమే పరాయి మగాడికి పెళ్లాం అంటున్నా ఊకున్నా. నీకోసమే అన్నీ భరించిన తల్లీ. ఇక నాతోటి కాదు. అందుకే దేవమ్మని తీసుకుని పోతున్నా’ అంటూ కన్నీరు పెడుతుంది రాధ. ‘వద్దమ్మా.. నన్ను విడిచి వెళ్లొద్దు. ప్లీజ్ అమ్మా.. కావాలంటే నీతో నన్ను కూడా తీసుకెళ్లు’ అంటూ రాధని పట్టుకుని ఏడుస్తుంది చిన్మయి. మరి చిన్మయి కోసం రాధ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..