Revanth Reddy : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలో సెప్టెంబర్ 17న సరికొత్త తెలంగాణను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు. వాహనాల కోడ్ టీఎస్‌ను తిరస్కరిస్తూ తాము అధికారంలోకి వచ్చాక టీజీగా మారుస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక అందెశ్రీ రాసిన జయజయహే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామన్నారు. దొరల తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ.. సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తామన్నారు. జాతీయ జెండాతో పాటు.. తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ప్రత్యేక జెండాను ఎగురవేస్తామని రేవంత్ తెలిపారు.
తెలంగాణ త్యాగాలపై కేసీఆర్ కప్పిన మబ్బులను తొలగిస్తామని రేవంత్ పేర్కొన్నారు. వాస్తవ చరిత్ర ప్రజలకు తెలిసేలా సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ కుటుంబ సభ్యుల ముఖ కవళికలున్నాయని… కాబట్టి దానిని తాము ఆమోదించబోమని, ఆ విగ్రహాన్ని తిరస్కరిస్తూ.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి.. దొరల తల్లి అని, ఆ విగ్రహం.. కిరీటాలు, భుజకీర్తులు ధరించి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠించనున్న తెలంగాణ తల్లి.. గాంభీర్యం, పిల్లల రక్షణ, సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబించించేలా ఉండబోతుందన్నారు.
Revanth Reddy : సోనియా గొప్పతనాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చుతాం..
రాష్ట్ర జెండాను కూడా ప్రత్యేకంగా ఆవిష్కరించబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గొప్పతనాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చే ఆలోచన సైతం చేస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు 17 వజ్రోత్సవాలు, రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర, మునుగోడు ఉప ఎన్నికల సన్నద్ధతపై సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ కీలక నిర్ణయాలన్నింటినీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఈనెల 17న ప్రారంభించి ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఈ క్రమంలో తెలంగాణ త్యాగాలపై కేసీఆర్ కప్పిన మబ్బులను తొలగించి.. తెలంగాణ చరిత్ర, ముఖ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించబోతోందని తెలిపారు.