Secunderabad : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా పెద్ద శబ్దాలతో దద్దరిల్లిపోయింది. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు ఏం జరుగుతుందో తెలిసేలోపే సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రికల్ షోరూం ఉంది. బిల్డింగ్ సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోదాం ఉంది. రాత్రి 8.45 సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్ పేలిపోయింది. చూస్తుండగానే మంటలు ఇతర వాహనాలకు వ్యాపించి, ఒక్కొక్కటిగా వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న రూబీ హోటల్ గదులకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో 25 మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు ప్రాణాలు దక్కించుకునేందుకు కిందకు దూకారు. ఓ మహిళ సహా.. మరో ఆరుగురు కిందకు దూకలేక.. మెట్ల వైపు పరుగులు తీశారు. ఆ ప్రయత్నంలో వారికీ మంటలు అంటుకున్నాయి.
Secunderabad : ఈ-స్కూటర్ల బ్యాటరీల చార్జింగ్‌తోనే ప్రమాదం?
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే షోరూం, గోదాము అగ్నికి ఆహుతయ్యాయి. హోటల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 54 మీటర్ల నిచ్చెన ఉండే వాహనంతోపాటు.. 5 ఫైరింజన్లు, స్మోక్ ఇస్టింగ్విషర్ వాహనాలు, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. పై అంతస్తులోని హోటల్ గదుల్లో చిక్కుకుపోయిన 10 మందిని కాపాడారు. షోరూం గోదాములో ఈ-స్కూటర్లను పార్క్ చేస్తారు. ఒక భాగంలో ఈ-స్కూటర్ల బ్యాటరీలను చార్జింగ్ చేస్తుంటారు. ఈ చార్జ్ చేసే సమయంలోనే షార్ట్ సర్క్యూట్ జరిగి.. ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది రావడం కాస్త లేటవడంతో స్థానిక యువకులే రిస్క్ చేసి మరీ పలువురిని కాపాడేందుకు యత్నించారు.