మాధవ్‌కు ఎలాంటి అవిటితనం లేదని తెలిసి నిర్ఘాంతపోతుంది రాధ. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుంటుంది. ఇల్లు అద్దెకు తీసుకుని దేవితో కలిసి ఉండాలనుకుంటుంది. మరోవైపు దేవుడమ్మ ఇంట్లో ఆడుకుంటుండగా చిన్మయికి రాధ, ఆదిత్యల పెళ్లి ఫొటో కనిపిస్తుంది. అది చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు తనకి. ఆ తర్వాత ఆగస్టు 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
అమ్మా రాధా.. అంటూ ఇల్లంతా కలియతిరుగుతూ వెతుకుతుంది జానకి. బెడ్రూంలో ఉందేమోనని వెళ్లగా అక్కడ బట్టలు బ్యాగ్‌లో పెట్టి కనిపిస్తాయి. అంతలోనే రాధ.. భాగ్యమ్మతో కలిసి ఇంటికి వస్తుంది. నీకోసమే చూస్తున్నానమ్మా.. ఇంట్లోనే ఉన్నావ్ కదా.. ఇంతలోనే ఎక్కడికి వెళ్లావ్ అని రాధని అడుగుతుంది. అప్పుడు అసలు విషయం చెప్పమని భాగ్యమ్మ రాధని బలవంతం చేస్తుంది. అయినా కానీ రాధ నోరు మెదపదు. చివరకు భాగ్యమ్మే.. ఈ బిడ్డ తన బిడ్డతో కలిసి అద్దె ఇంట్లో ఉండడానికి ఇల్లు చూసి వచ్చినమని చెబుతుంది. అది విని షాకవుతుంది జానకి. ‘ఉన్నట్టుండి అలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి రాధ’ అని నిలదీస్తుంది. హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావ్. నువ్ ఈ ఇంటికి వచ్చిన రోజు నాకు నచ్చితేనే ఈ ఇంట్లో ఉంటా.. నచ్చకపోతే వెళ్లిపోతా అని చెప్పావ్ కదా. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని.. అడుగుతుంది జానకి. ‘చెప్పడానికి ఏం లేదు.. బయటికి వెళ్లాలనిపించింది వెళ్లున్నా’ అని చెబుతుంది రాధ. కానీ జానకి మాత్రం అసలు నిజం అది కాదని.. ‘నీతో మాకే కాదు. ఈ ఇంటికి కూడా ఎంతో అనుబంధం ఉంది. ఆ పసిదానికి ప్రాణం పోయడానికి వచ్చిన పరాయిదానివి. కానీ ఈ రోజు ఊరందరి దృష్టిలో ఈ ఇంటి కోడలివి. పాలిచ్చి ప్రాణం పోసిన చిన్మయికి నువ్ ఎందుకు వెళ్లిపోతున్నావ్ అంటే ఏం చెప్పాలి’ అని ఎమోషనల్ అవుతుంది. అయినా రాధ మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోతుంది.
మరుసటి రోజు ఉదయమే ఆదిత్య దేవి, చిన్మయిలను తీసుకుని మాధవ్ ఇంటికి వస్తాడు. దేవీ తనకు బుడ్డ రుక్మిణిని వదిలిపెట్టి రావాలనిపించలేదని చెబుతుంది. మాధవ్ ఎదురుగా వచ్చి ‘వద్దూ వద్దూ అన్న నా పిల్లల్ని రెండు రోజులు ఉంచుకునే స్థాయికి వచ్చావ్. దేవమ్మా ఇంటికి వచ్చింది. ఇక నీ సొంతం అవుతుందని ఆనందపడుతున్నావా. అది ఎప్పటికి జరగదు’ అని హెచ్చరిస్తాడు. నువ్ అన్నంత మాత్రానా అది జరగకపోదని ఆదిత్య రిప్లై ఇస్తాడు. ‘నా బిడ్డని నా అనుమతి లేకుండా తీసుకువెళ్లొద్దన్నా ఎందుకు తీసుకెళ్లావ్ ఆఫీసర్’ అంటూ అరుస్తాడు మాధవ. అంతలోనే అక్కడకు వచ్చి ‘ఎవరి బిడ్డని తీసుకుపోవడానికి ఎవరి అనుమతి కావాలి’ అంటూ కాళికామాతలా మండిపడుతుంది రాధ. నీ సపోర్టు ఆదిత్యకే అయితే ఎలా రాధ అని మాధవ్ అనగా.. ‘నా పెనిమిటికి నేను కాక ఎవరు సపోర్ట్ చేస్తారు. అయినా మా బిడ్డని నీ బిడ్డ అంటవేంది’ అంటూ కళ్లెర్రజేస్తుంది రాధ. నా బిడ్డకాక మరెవరి బిడ్డ అవుతుంది. ఊరంతా అదే అనుకుంటున్నారని మాధవ్ రిప్లై ఇస్తాడు. ఊరంతా ఏమనుకున్నా నా మెడలో తాళి కట్టింది నా పెనిమిటి అంటూ మాధవని ఓ రేంజ్‌లో ఆట ఆడుకుంటుంది రాధ. రేపటి నుంచి దేవిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్లు అని సలహా ఇస్తుంది ఆదిత్యకు. రుక్మిణిలో వచ్చిన ధైర్యానికి ఆనందపడిపోతాడు ఆదిత్య లోలోపల.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ ఫొటోను చూస్తూ ఆనందపడుతుంది. ఏమైంది దేవుడమ్మ.. ఎందుకు నవ్వుతున్నావ్ అని భర్త వచ్చి అడగ్గా.. ఈ చిట్టి రాక్షసి మన బొమ్మల్ని చూడండి ఎంత బాగా గీసిందో అంటూ చూపిస్తుంది. ఇద్దరూ కలిసి దేవీ చేసిన అల్లరి పనుల గురించి మాట్లాడుకుంటూ ఆనందపడతారు. దేవిలో ఉన్న లక్షణాల్ని చూసి.. మాధవ, రాధలు అదృష్టవంతులు అంటూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. కొన్ని సార్లు దాన్ని చూస్తే నాకు అద్భుతంగా అనిపిస్తుందంటూ దేవిని కొనియాడుతుంది. రుక్మిణి కూడా తన బిడ్డతో వస్తే ఎంత బాగుంటుందో.. అని భర్తతో చెబుతుంది. దేవిని చూస్తే నాకు మన రుక్మిణి బిడ్డ కూడా ఇలాగే ఉంటుందేమోననిపిస్తుంది అంటూ కంటతడి పెడుతుంది దేవుడమ్మ.
మరోవైపు సత్య ఆదిత్య గురించి ఆలోచిస్తుంది. కన్న తల్లిని, కట్టుకున్న భార్యని చూసినా రాని ఆనందం దేవిని చూస్తే ఎందుకు వస్తుంది. అంతగా అభిమానించాల్సిన అవసరం లేదుగా. మా అక్క కూడా దేవిని ఎందుకు ఆదిత్యకు దగ్గర చేయాలని చూస్తుంది. ఈ రోజు అక్క కుటుంబం అక్కకే అయినపుడు దేవిని దగ్గర చేయాల్సిన అవసరం ఏముంది. నాకోసమే కదా అక్క ఈ ఇంటిని వదిలేసి అందరికీ దూరంగా వెళ్లింది. అందర్నీ వదిలేసి తను ఒంటరిగా వెళ్లినా.. ఈ రోజు అక్కకు ఒక కుటుంబం ఉంది. ఇద్దరు పిల్లలున్నారు. అత్త, మామ, పేరు మర్యాదలున్నాయి. అక్కే దేవిని ఆదిత్యకు దగ్గర చేస్తుందనుకుంటే.. మాధవ్ కూడా ఎందుకు ఏం మాట్లాడడం లేదు. దేవీ ఈ ఇంటికి వచ్చినా ఎందుకు గొడవ చేయట్లేదు. నాకు తెలియకుండా ఏం జరుగుతుంది. అటు అక్క మారింది, ఇటు మాధవ్ మారాడు. ఇంటిని నన్ను కాదని దేవి చుట్టూ తిరిగేలా ఆదిత్య మారాడు. ఆదిత్య అమెరికా వెళ్లే ఏర్పాట్లు కూడా ఏం చేయట్లేదు. నాలో సహనం కూడా తగ్గిపోతుంది. ఇంకా చూస్తూ ఉంటే తప్పు నాదే అవుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలని మనసులో గట్టిగా అనుకుంటుంది సత్య.
ఆ తర్వాత సీన్‌లో రాధ మాధవ్ చేసిన మోసాన్ని తలుచుకంటూ బాధపడుతుంది. అంతలోనే అమ్మా.. అనుకుంటూ దేవి వచ్చి.. నా కోసం దేవుడమ్మ అవ్వ డ్రెస్ కుట్టింది. మంచిగా ఉంది కదా అంటూ హుషారుగా చెబుతుంది. కానీ చిన్మయి మాత్రం రుక్కు, ఆదిత్యల పెళ్లి ఫొటో గురించే ఆలోచిస్తుంది. బిడ్డా.. ఏమైంది అంటూ చిన్మయిని దగ్గరకు తీస్తుంది రాధ. ‘బిడ్డా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మళ్లీ మళ్లీ నేనేం చెప్పలేను. రేపటి నుంచి నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. ఎట్లా ఉండాలి ఏం చేయాలో.. అన్నీ నేర్పించిన కదా. మంచిగా స్కూల్‌కి వెళ్లి చదువుకుని గొప్పదానివి కావాలి’ అంటూ చిన్మయికి సూచిస్తుంది రాధ. ఆ నిర్ణయాన్ని చిన్మయి అంగీకరిస్తుందా? లేదా అనేది తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..