Non BJP Front : తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీయేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీనికి అన్ని పార్టీల నేతలు సైతం సానుకూలంగానే స్పందిస్తున్నారు. బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్‌కు ఆయన నుంచి సంకేతాలు ఇంకా అందలేదని తెలుస్తోంది. నిజానికి నవీన్ పట్నాయక్ ఎన్డీయేలో భాగస్వామేమీ కాదు కానీ అంశాలవారీగా ఆయన బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. కీలకమైన బిల్లులకు మద్దతిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతిచ్చారు.
బీజేపీయేతర ఫ్రంట్‌లోకి నవీన్ పట్నాయక్‌ను తీసుకురాగలిగితే మాత్రం ఇక ప్రతిపక్ష కూటమికి తిరుగుండదు. బీజేపీయేతర పార్టీల నేతలందరితో సమావేశం అవుతున్న కేసీఆర్ సైతం ఇప్పటి వరకూ నవీన్ పట్నాయక్‌తో మాత్రం ఇంకా సమావేశం కాలేదు. మరోవైపు నవీన్ పట్నాయక్ సైతం కేసీఆర్‌ను కలిసేందుకు ఉత్సాహం చూపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన తటస్థంగానే ఉంటారని అర్ధమవుతోంది. ప్రస్తుతానికి ఆయన వైఖరి ఇదే అయినా 2024 పార్లమెంట్ ఎన్నికల సమయానికి మార్పు రావొచ్చు. అటు కేసీఆర్ కూటమిలో అయినా చేరొచ్చు లేదంటే ఎన్డీఏకు మద్దతుగా నిలవొచ్చు అదీ కాదంటే తటస్థంగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Non BJP Front : నవీన్ పట్నాయక్‌ను కలవనున్న నితీశ్?
ఆసక్తికర విషయం ఏంటంటే.. కేసీఆర్ కాంగ్రెస్ నాయకత్వాన్ని మినహా మిగిలిన కీలక నేతలందరినీ ఇప్పటికే కలిశారు. అయితే ఆయన తరుఫున బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా వామపక్షాల నేతలు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేజ్రీవాల్‌ను నితీశ్ కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన నవీన్ పట్నాయక్‌ను కలిసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యత్నించనున్నారు. నితీశ్‌ను కలవడంలో నవీన్ పట్నాయక్‌కు కూడా అభ్యంతరం లేదని సమాచారం. కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటుకు యత్నిస్తోన్న నితీశ్‌కు నవీన్ పట్నాయక్ ఏం చెబుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీయేతర కూటమి ఏర్పాటులో కాంగ్రెస్ ఉండాల్సిందేనని నితీశ్, లాలూ, శరద్ పవార్ తదితర నేతలంతా గట్టిగా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ వారి ఒత్తిడికి తలొగ్గుతారా లేక కాంగ్రెసేతర తటస్థ కూటమిలో ఉంటారా అనేది 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలే అవకాశముంది.