KCR – BJP: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమ, మంగళవారం రెండు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. కేవలం రెండు రోజుల పాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, రెండు రోజుల టైమ్ సరిపోదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తు్న్నాయి. వారంపాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిస్తామని చెబుతోంది. సోమవారం ఉదయం జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కేసీఆర్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించాలని స్పీకర్ కు తీర్మానాల నోటీసులు ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఈ సమావేశాలను కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ఉపయోగించుకోవాలని చూస్తోంది. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రవేశపెట్టనున్న క్రమలో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అప్పుల వివరాలను కేసీఆర్ బయటపెట్టే అవకాశముంది.
కేంద్రం తెలంగాణ పట్ల చూపుతున్న విపక్ష, అన్యాయం గురించి టీఆర్ఎస్ అసెంబ్లీ చర్చించే అవకాశముంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని తగ్గించి రాష్ట్రానికి అప్పు రాకుండా చేసిన కేంద్రం తీరును అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఎండగడతారని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర అంశాలపైనే ప్రధానంగా ప్రభుత్వం చర్చించేందుకు సిద్దమవుతోంది. బీజేపీని అసెంబ్లీలో దోషిగా నిలబెట్టే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ ఉపయోగించుకోనున్నారు.
ఇక స్పీకర్ మనమనిషి అని, కేసీఆర్ చెప్పినట్లు చేయడం తప్పితే ఆయన ఏకపక్షంగా వ్యవహరించడం లేదంటూ ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతోంది. ఈటల వ్యాఖ్యలపై శానససభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పీకర్ స్థాయిని తగ్గించి కించపర్చడం సరికాదని హెచ్చరించారు.
KCR – BJP:
అయితే సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ పై చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశమందని సమాచారం. ఇది బూచిగా చూపించి సభ నుంచి ఈటలను సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈటల వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, స్పీకర్ నోటీసులు జారీ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో సోమవారం అసెంబ్లీలో ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇచ్చే అవకాశముంది. దీంతో అసెంబ్లీస మావేశాలు వాడివేడిగా జరిగే అవకాశముంది.