Narayana Swamy : ఏపీలో వైసీపీ నేతల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంటోంది. కొన్ని నియోజకవర్గాలకు చెందిన రైతులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం మరో నేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆయన ఎవరిపై విమర్శలు చేశారన్న విషయం మాత్రం తెలియ రాలేదు. అయితే తనపై కుట్రంతా గంగాధర నెల్లూరు మండలంలో జరుగుతోందని పేర్కొనడంతో నారాయణ స్వామి ఆగ్రహమంతా ఆ నియోజకవర్గానికి చెందిన నేతపైనే అని తెలుస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని ఓ నేత తనపై చేసిన ఆరోపణలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. తాజాగా మీడియాతో నారాయణ స్వామి మాట్లాడుతూ.. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కుట్రంతా గంగాధర నెల్లూరు మండలంలో మాత్రమే జరుగుతోందన్నారు. అయితే తనపై ఆరోపణలు చేసిన నేత పేరును మాత్రం నారాయణ స్వామి ప్రస్తావించలేదు. అవినీతి చేశానని నిరూపిస్తే.. వాళ్ల కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ఇలాంటి ఆరోపణల వల్ల భవిష్యత్తులో సీఎం జగన్‌కు తనపై నిజంగానే కోపం వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Narayana Swamy : వాళ్ల కాళ్లకు దండం పెట్టేందుకు కూడా సిద్ధమే
‘నాపై ఆరోపణలు చేసిన మహానుభావుడి పేరు చెప్పను కానీ.. నన్ను అవమానించిన విషయం చెబితే ఏమవుతుందన్నది ఆయనకు తెలియటం లేదు. ఆయనకు నేనేదో అన్యాయం చేశానని చెబుతున్నారు. నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టు కానీ.. అవినీతి చేసినట్టు కానీ.. అన్యాయం చేసినట్టు కానీ.. ఆయనైనా లేదా అతని అనుచరుల్లో ఏ ఒక్కరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లకు దండం పెట్టేందుకు కూడా సిద్ధమే. ఆ మహానుభావుడే గతంలో నేను ఎస్సీగా పుట్టి ఉంటే బాగుండేది.. నాకూ ఓ పదవి దక్కేదంటూ వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని నమ్ముకుని ఆయన వెంట ఉండే కార్యకర్తలు మోసపోవద్దు. ఆయన మాటలు నమ్మి పార్టీకి, కుటుంబానికి మోసం చేయద్దు. పార్టీకి అన్యాయం చేసేవాళ్లు పార్టీని వీడిపోవాలి.’ అని నారాణయ స్వామి తమ సొంత పార్టీ నేతపైనే విమర్శలు గుప్పించారు.