మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు, మనోజ్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో స్టార్ హీరోల రేంజ్ ని అందుకోలేకపోతున్నారు. ప్రయోగాలు చేస్తూ, సొంత నిర్మాణంలో సినిమాలు చేస్తున్న కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకోదగ్గ సినిమాలు వారి ఖాతాలో సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయని చెప్పాలి. కొన్ని సినిమాలు డిజాస్టర్ అయితే మరికొన్ని ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితిలో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇదిలాఉంటే మంచు విష్ణు మోసగాళ్లు లాంటి డిజాస్టర్ తర్వాత మంచు విష్ణు తనకి అలవాటైన కామెడీ జోనర్ ని పట్టుకొని జిన్నా టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎప్పటిలాగే ఫన్ జెనరేట్ చేసే గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో మంచు విష్ణు సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక అతను తన గ్యాంగ్ తో పండించే కామెడీతో కథని నడిపించి కథలో కీలక పాత్రగా సన్నీ లియోన్ ని పరిచయం చేశాడు.
ఇక సన్నీ లియోన్ గ్రామంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెకి దెయ్యం పట్టి అందరినిభయపెట్టి ఓ ఆట ఆడుకుంటుంది. ఇక ఆ దెయ్యాన్ని వదిలించడానికి జిన్నా ఎలాంటి ఫీట్లు చేసాడు అనేది సినిమాలో చూపించబోతున్నాడని టీజర్ బట్టి అర్ధమవుతుంది. పాయల్ రాజ్ పుత్ పాత్రలో గాలి నాగేశ్వరరావకి జోడీగా ఉన్న కంటెంట్ లో ఆమెకి పెద్దగా ప్రాధాన్యత లేనట్లే కనిపిస్తుంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా కొంత కాలం వైబ్ క్రియేట్ చేసిన హర్రర్ కామెడీ జోనర్ లో మంచు విష్ణు ఈ సినిమా చేస్తున్నాడు. ఇక టీజర్ రిలీజ్ సందర్భంగా ఈ సారి పక్కా హిట్ కొడుతున్నాం అని విష్ణు చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. మరి ఈ సినిమా అతనికి ఎంత వరకు సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.