మహిళలు కెరీర్ కోసం ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తుంటారు. అయితే పండంటి బిడ్డ కోసం, ముప్పై ఏళ్ల లోపే గర్భం దాల్చడం మేలని సూచిస్తున్నారు వైద్యులు. వయసు పైబడుతున్న కొద్దీ మహిళల్లో థైరాయిడ్, ఒబేసిటీ, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా వరుసగా గర్భస్రావాలు కూడా జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతమున్న ఉరుకులు పరుగుల జీవితంలో వంట చేసుకునే తీరిక లేక యువత జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో అధిక బరువు సమస్య ఎక్కువవుతోంది.
గర్భదారణకు 20 నుంచి 22 ఏళ్ల వయసు అనువైనది. కానీ ఇప్పటి రోజుల్లో ఈ వయసులో పెళ్లిళ్లకు సిద్ధపడే అమ్మాయిల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఉన్నత చదువులు, కెరీర్ కోసం పెళ్లిళ్లు వాయిదా వేస్తున్నారు. దాంతో వయసు దాటిపోయి గర్భదారణ అవకాశాలు తగ్గి, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి వీలైనంత ముందే.. అంటే 30 ఏళ్ల లోపే గర్భాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
మహిళలకు 30 ఏళ్లు దాటితే అండాల నాణ్యత తగ్గి అబార్షన్లయ్యే అవకాశాలు ఎక్కువవుతున్నాయి. క్రోమోజోమ్ సమస్యల వల్ల గర్భం దాల్చినా.. పుట్టే పిల్లల్లో జన్యు సమస్యలు తలెత్తవచ్చు. మధుమేహంతో గర్భం దాలిస్తే.. కడుపులో ఉన్న బిడ్డ ఎక్కువ బరువు పెరిగిపోయి సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవచ్చు. అంతే కాకుండా పుట్టే బిడ్డలో గుండె సమస్యలు కూడా తలెత్తవచ్చు. గర్భిణికి హై బిపి ఉంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్త పోటు వల్ల గర్భంలోనే బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువే. లేటు వయసులో గర్భం దాలిస్తే.. నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా సాధారణ ప్రసవం కష్టతరమై, సిజేరియన్ అవకాశాలు పెరుగుతాయి. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల, పిల్లల బాగోగులు చూసే ఓపిక తల్లుల్లో నశించిపోతుంది. దాంతో తల్లికీ, బిడ్డకీ మధ్య దూరం పెరుగుతుంది.
అయితే కొందరు మహిళలు పెళ్లయ్యాక కూడా మూడు నుంచి నాలుగేళ్ల పాటు గర్భధారణను వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత ప్రయత్నాలు చేసినా నెలసరికీ కుంగిపతూ, విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. ఈ ఒత్తిడి ప్రభావం కూడా గర్భధారణకు అడ్డంకిగా మారుతుంది. మహిళలు గర్భం దాల్చకపోవడానికి 40 శాతం కారణం వారి భర్తల్లో ఉంటే, 40 శాతం మహిళల్లో, మిగతా 10 నుంచి 20 శాతం వివరించలేని కారణాలుంటాయి.