దేవికి నిజం చెప్పలేక తనలో తానే కుమిలిపోతుంది రాధ. మరోవైపు మాధవ్ రోజుకో కొత్త ప్లాన్ వేస్తుంటాడు. ఆదిత్య, రాధలను గట్టిగా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. జానకి కొడుకు ప్రవర్తన మీద అనుమానం కలిగి.. ప్రశ్నిస్తుంది. కానీ మాధవ్ నిజం చెప్పకుండా తప్పించుకుంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆదిత్య స్కూల్ నుంచి దేవిని ఇంటికి తీసుకెళ్తాడు. సత్యకు ఫోన్ చేసి విషయం చెబుతాడు. దేవి తినడానికి స్నాక్స్ చేసి పెట్టమంటాడు. ఆదిత్య మాటల్లో కనిపిస్తున్న ఆనందం చూసి సత్య ఆలోచనలో పడుతుంది. ఈ ప్రేమ కమలక్క బిడ్డ పట్ల ఎందుకు లేదని ఫీల్ అవుతుంది. చిన్మయిని తీసుకుని రాధ ఇంటికి వెళ్తుంది. వీడియో గేమ్స్ ఆడుతూ ఎదురుగా దర్శనమిస్తాడు మాధవ్. ‘నాలుగు రోజుల నుంచి ఓడిపోతూ.. మళ్లీ మళ్లీ ఆడి ఆడి గెలిచా. ఓడే అలవాటే లేదు’ అని రాధతో వెటకారంగా అంటాడు. చిన్మయి.. దేవి ఏదమ్మా అని అడగ్గా.. మీ నాయనకి నేను చెప్తా నువ్వెల్లమ్మా అంటూ పంపిస్తుంది రాధ. ఆ తర్వాత మాధవ మాటలకు రిప్లై ఇస్తుంది. నా బిడ్డకు నా ఇంటికి దార్లు పడుతుంటే నీకు ఎంత పట్టుదల వచ్చినా ఏం ఉంటుంది. దేవమ్మ ఏది అని అడిగినవ్ కదా.. వాళ్ల నాయన వేలు పట్టుకుని పోయింది. ఇట్ల పోతూనే ఉంటది. ఏదో ఒకరోజు అక్కడే ఉండిపోతది.. అని రాధ వార్నింగ్ ఇస్తుంది. ‘చూశావా మనిద్దరి ఆలోచనలు ఎలా కలుస్తున్నాయో. దేవిని పర్మినెంట్‌గా అక్కడికే పంపించాలని నేనూ చెప్పాను కదా. ఎందుకంటే దేవి అక్కడే ఉంటే మనిద్దరికి అడ్డు ఉండదు కదా’ అని అంటాడు మాధవ. దానికి రాధ కళ్లెర్రజేస్తూ ‘సారూ’ అని అరుస్తుంది. రాధా.. కూల్‌గా ఉండు. ఆవేశపడితే ఉపయోగం ఉండదు. నా ఆలోచన బాగుందని నీకే అనిపిస్తుందని చెప్పి వెళ్తాడు మాధవ. అంతలోనే జానకి వచ్చి రాధా.. ఎవరో అరిచినట్టు వినిపించింది ఏమైందని అడుగుతుంది. అయినా రాధ నోరు విప్పదు. దేవి ఎక్కడా? అని అడగ్గా.. రాధ కోపంగా జవాబిస్తుంది జానకికి. అది చూసి షాకవుతుంది జానకి.
సీన కట్ చేస్తే.. దేవి కోసం దేవుడమ్మ కుటుంబమంతా ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తుంటుంది. అంతలోనే ఆదిత్య కారు వచ్చి ఆగుతుంది. దేవి అని రాగానే కౌగిలించుకుంటుంది దేవుడమ్మ. నీకోసం నేను ఎదురుచూడాలా అని దేవుడమ్మ తమాషాగా అంటే.. సారూ పోదాం పదండి అంటుంది దేవి. అలా అంటే అమ్మ హర్ట్ అవుతుంది అని ఆదిత్య అంటే అవ్వ మాటలకు నేను కూడా హర్ట్ అయ్యాను అంటుంది. ‘అవ్వా.. నా చిట్టి చెల్లి ఎక్కడుంది’ అని దేవి అనగా.. కమల బిడ్డని ఎత్తుకుని వస్తుంది. ఆదిత్య చెల్లెని ఎత్తుకోమ్మా అని చెప్పగా.. లే కాళ్లు, చేతులు కడుక్కోకుండా పసి పిల్లల్ని ఎత్తుకోకూడదిని చెప్తుంది దేవి. దేవి మాటలు విని ఇంటిల్లిపాది సంబరపడిపోతారు.
మాధవ మాటలు తలుచుకుంటూ రాధ కోపంతో రగిలిపోతుంది. ‘ఎన్ని మాటలన్నా ఏం చేయలేకపోతున్నా. నా బిడ్డని ఎట్లయినా ఇంట్ల నుంచి పంపాలి’ అనుకుంటుంది మనసులో. ఒంటరిగా బాధపడుతున్న రాధని దూరం నుంచి చూసి ఏమైందని అడుగుతుంది జానకి. పదేళ్లుగా ఇంట్లో ఉంటున్నావ్. ఎపుడు ఇలా లేవు. ఏమైందమ్మ. నిన్ను అలా చూస్తూ నేను ఉండలేకపోతున్నా.. అని జాలిపడుతూ అడుగుతుంది. ఏం లేదు అని రాధ చెప్పగా.. ఆ మాట అబద్ధమని పసిగడుతుంది జానకి. ‘నీ కుటుంబం విషయం అడగకూడదన్నావ్. అడగడం మానేశాం. కనీసం నీ కష్టం ఏంటని అడిగే హక్కు మాకు లేదు. హక్కుతో కాకపోయిన అభిమానంతో కూడా అడగకూడదు. ఇంట్లో ఆడపిల్ల బాధపడితే అది ఇంటికే మంచిది కాదమ్మా..’ అంటూ పలు రకాల ప్రశ్నల వర్షం కురిపిస్తుంది జానకి. నిన్ను మా ఇంటి దేవతలా చూస్తున్నాం. ఆరిపోవాల్సిన ఈ ఇంటి దీపాన్ని నువ్ కాపాడావ్.. అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది జానకి. ‘మీ బిడ్డ ఇట్ల చేస్తుండని మీకెలా చెప్పాలి’ అనుకుంటూ తనలో తానే కుమిలిపోతుంది రాధ. ‘అందరి దృష్టిలో నువ్ ఈ ఇంటి కోడలివే అయినా.. నా దృష్టిలో మాత్రం నా బిడ్డవే. నువ్ ఉంటే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది’ అని రాధని పొగడుతుంది జానకి. మరి ఆ మాటలకు కరిగిపోయి రాధ.. మాధవ్ నిజస్వరూపం ఏంటో చెప్పేస్తుందా.. తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..