Bigboss 6 : పలు భాషలతో పాటు తెలుగులో సైతం అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమైంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఈసారి 20 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. అయితే అసలు వీరిలో కంచు కరోడాస్ అంటే పెద్దగా ఏమీ లేదండి.. కంటెంట్ బాగా ఇవ్వగలిగి.. కాస్త గట్టిగా మాట్లాడటం.. కొట్లాడటం వంటివి చేయగలిగిన వారు ముగ్గురు కనిపిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం.
నేహా చౌదరి : నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ నేహా చౌదరి . రారా.. రక్కమ్మ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్‌ను ఒక ఊపు ఊపేసింది. ఇంట్లో సీరియస్‌గా సంబంధాలు చూస్తున్నారని.. తన పెళ్లి సంగతులు వివరిస్తూ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఐపీఎల్)లో యాంకర్‌గా నేహా చౌదరి మాంచి పాపులారిటీని దక్కించుకుంది. చూడబోతే అమ్మడు కాస్త గట్టిగానే కనిపిస్తోంది. మంచి దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.
గీతూ రాయల్ : ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ అలియాస్ గలాటా గీతు ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ షోకి రావడానికి 3 కారణాలున్నాయని గీతు చెప్పుకొచ్చింది. అమ్మడు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. గతంలో బిగ్‌బాస్‌కి రివ్యూస్ ఇస్తూ ఉండేది. ఇప్పుడు అదే బిగ్‌బాస్‌కి కంటెస్టెంట్‌గా వచ్చింది. తనను తాను తెలుసుకునేందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా గీతూ రాయల్ సైతం గట్టి క్యాండిడేట్‌గానే కనిపిస్తోంది. అవసరమైతే.. గట్టిగానే మాట్లాడేలా ఉంది. ఇక టాస్క్‌లోనూ బాగానే కొట్లాడే అవకాశం కనిపిస్తోంది.
అభినయశ్రీ : అస్సలు పరిచయం అక్కర్లేని వ్యక్తి. అ అంటే అమలాపురం సాంగ్‌తో యూత్‌ని ఓ ఊపు ఊపేసింది. తొమ్మిదో కంటెస్టెంట్‌గా అభినయ శ్రీ ఎంట్రీ ఇచ్చింది. తనకు బాగా పేరు తీసుకొచ్చిన ‘అ అంటే అమలాపురం’ సాంగ్‌తోనే స్టేజ్ మీదకు వచ్చింది. స్నేహమంటే ఇదేరా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్, వంటి పలు షోలకు హోస్ట్‌గానూ అలరించింది. 2014లో పాండవులు సినిమాలో చివరిసారిగా నటించింది. ఈ అమ్మడు సైతం కొట్లాటకైనా.. దేనికైనా తగ్గేదేలే అంటూ దూసుకెళ్లేలా కనిపిస్తోంది.
ఆర్టిస్ట్ షానీ : 13వ కంటెస్టెంట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ షానీ అలియాస్ సాల్మన్ వచ్చాడు. తన ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్ పేర్ల నుంచి తన పేరును షానీగా మార్చుకున్నానని తెలిపాడు. తను ఓ ఫ్రొఫెషినల్ ఖోఖో ప్లేయర్ అని, నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ కూడా సాధించానని చెప్పొకొచ్చాడు. 2003లో తనకు ప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి కెరియర్‌కు గుడ్‌బై చెప్పానని చెప్పాడు. అదే సమయంలో రాజమౌళి ‘సై’ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లానన్నాడు. ఆ సినిమాకు సెలెక్ట్ అయ్యానని ఫోన్ వచ్చిన మరుసటి రోజే తన తల్లి చనిపోయిందంటూ షానీ భావోద్వేగానికి గురయ్యాడు. ఘర్షణ, దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్కమగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని, అమరన్, గ్రే లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. ఇతను కూడా కాస్త గట్టిగానే నిలబడేలా కనిపిస్తున్నాడు. వీళ్లతో పాటు ఫైమా, రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్ ఇనయా సుల్తాన సైతం కాస్త గట్టిగానే కనిపిస్తున్నారు. మరి మన గెస్ ఎంతవరకూ కరెక్ట్ అవుతుందో వేచి చూడాలి.