Nuvvu Naaku Nachav: కొన్ని సినిమాలుంటాయి.. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అదిరిపోయే హిట్ కొడతాయి. అంచనాల మాట అటుంచితే.. ఫస్ట్ డే షో ఫ్లాప్ టాక్ వచ్చి ఆ తరువాత సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటి కోవకు చెందిందే.. ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీ. అప్పట్లో అమెరికాలో ఉద్యోగం అంటే ఎగిరి గంతేసి మరీ అమ్మాయిలు ఓకే చెప్పేసేవారు. పెద్దవాళ్లు సైతం అమెరికాలో ఉద్యోగం అంటే ఏమాత్రం వెనుకాడక అల్లుడిని చేసుకునేందుకు ముందుకొచ్చేవారు. కానీ ఫైనల్‌గా అమెరికా సంబంధం వద్దు.. ప్రేమ బంధమే ముద్దు అని చెబుతూ తీసిన సినిమాయే ‘నువ్వు నాకు నచ్చావ్’.
విక్టరీ వెంకటేశ్ హీరోగా సినిమాలో నటించారు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. నిజానికి వెంకీ ఓ పట్టాన సినిమాలను అంగీకరించరట. కొత్తదనం కోరుకుంటారట. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే వెంటనే షూటింగ్ మొదలు పెట్టుకుందాం అనేశారట. ఆ తర్వాత నిర్మాత సురేష్ బాబు సైతం పచ్చజెండా ఊపేశారట. ఇక హీరోయిన్.. కొత్త భామను పరిచయం చేయాలని భావించిన స్రవంతి రవికిశోర్ ‘పాగల్ పన్’ సినిమా చూసి ఆర్తి అగర్వాల్‌ను సెలక్ట్ చేసుకున్నారట. తారాగణం అంతా ఓకే అవడంతో వెంటనే ఈ సినిమా పట్టాలెక్కేసింది.
Nuvvu Naaku Nachav: అరగంట తగ్గిస్తే బాగుంటుందని శ్రేయోభిలాషులు చెప్పారు..
‘అయితే కథ ఎక్కువగా ఒకే ఇంట్లో జరుగుతోంది.. కొన్ని సీన్లు ఔట్ డోర్‌లో ఉండేలా ప్లాన్ చేయండి’ అని సురేష్ బాబు సలహా ఇచ్చారు. దీంతో ఆషా శైనీ పెళ్లి సీన్లను క్రియేట్ చేసి.. ఊటీ ఎపిసోడ్, బ్రహ్మానందం ఎపిసోడ్స్‌ను కొత్తగా యాడ్ చేశారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర విషయానికి వస్తే అప్పట్లో ఆయనపై ‘మా’ నిషేధం విధించింది. వేరే ఎవ్వరూ ఆ పాత్రకు సూట్ కారని.. నిషేధం ఎత్తేసే వరకూ వెయిట్ చేసి మరీ ఆ క్యారెక్టర్ ఆయన చేత చేయించారు. ప్రకాష్ రాజ్ తన వర్క్ మొత్తం 17 రోజుల్లో పూర్తి చేశారు. వెంకీ రెమ్యూనరేషన్ రూ.2.5 కోట్లు సహా నిర్మాణానికి ఆరున్నర కోట్లు ఖర్చైంది. 64 రోజుల్లో ఈ చిత్రం పూర్తైంది. సినిమా నిడివి మూడు గంటల తొమ్మిది నిముషాలు. అరగంట తగ్గిస్తే బాగుంటుందని శ్రేయోభిలాషులు చెప్పారు.. కానీ సురేశ్ బాబు, నిర్మాత రవి కిశోర్ తగ్గేదే లే అన్నారు. 2001 సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలైంది. తొలి టాక్ ‘సినిమా పోయింది’ అంటూ వచ్చింది. ‘అబ్బే.. మూడు వారాలు కూడా కష్టమే’ కొందరన్నారు. ఎక్కువ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు భారీగా నష్ట పోతారు.. అన్నవాళ్లూ ఉన్నారు.కానీ రెండో వారం నుంచి కలెక్షన్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సినిమా సూపర్ హిట్ అయ్యింది.