నిన్నటి ఎపిసోడ్‌లో అబద్ధం చెప్పినందుకు మాధవను నిలదీస్తుంది దేవి. ఎప్పటిలాగే తండ్రి కావాలని మారాం చేస్తుంది. మరోవైపు దేవుడమ్మ కొడుకు, కోడల్ని అమెరికా పంపించే ప్రయత్నం చేస్తుంటుంది. అక్కడేమో రాధా, మాధవల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆ తరువాత ఆగస్టు 4 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మాధవ్ దేవి, ఆదిత్య కలవకుండా చేస్తానని ఛాలెంజ్ విసురుతాడు రాధతో. దానికి బదులుగా రాధ కూడా ‘ఎన్నాళ్లు అబద్ధం చెప్పి మోసం చేస్తావో నేను కూడా చూస్తా’నని సవాల్ చేస్తుంది. ఆ తర్వాత ఆదిత్య దేవి కోసం స్కూల్‌కు వెళ్తాడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆదిత్యను పట్టుకుంటారు. వాళ్లతో కాసేపు ముచ్చటిస్తాడు ఆదిత్య. పిల్లలు బుడ్డ రుక్మిణిని చూడాలని ఉందంటారు. సరేనమ్మ తీసుకెళ్తానంటాడు ఆఫీసర్.
భాగ్యమ్మ రాధతో.. దేవికి ఆదిత్యే తన తండ్రని చెప్పమంటుంది. లేకపోతే నేనే చెప్తానంటుంది భాగ్యమ్మ. ‘బిడ్డ నా కళ్లముందే నాయనా.. నాయనా అంటుంటే పానం పోయినట్టుంటుంది. కానీ ఎందుకు చెప్తలేనమ్మా.. బిడ్డ అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. చిన్మయి వచ్చి నువ్ మా అమ్మవి కాదా? అంటే నేనేం చెప్పాలి. ఇక్కడి నుంచి పోవాలంటే చాలా ఉన్నాయి. అక్కడ సత్య గురించి కూడా ఆలోచించాలి. దేవుడమ్మ నేను ఉన్నానని తెలిస్తే ఊరుకుంటుందా. సత్య బతుకేం కావాలి. నా బిడ్డకి నిజం చెప్పి నా చెల్లెల్ని చంపుకోమంటావా’ అంటూ ఎమోషనల్ అవుతుంది రాధ. ఆ పొద్దు అన్నీ సంపుకొని అడుగుబయటపెట్టినా.. ఇపుడు అందరూ కావాలని వస్తే.. నా చెల్లె బతుకు బుగ్గి పాలవుతుంది అంటూ కంటతడి పెడుతుంది. దేవమ్మ అన్నీ అర్థం చేసుకునేదాకా ఏం చేయలేనమ్మా అని అంటుంది తల్లితో.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ రాధపై కోపంతో రగిలిపోతుంటాడు. ‘నా అహం మీద మీరిద్దరూ కొట్టిన దెబ్బను నేనెలా మర్చిపోతాను. ఈ ఇంటి గడపను ఎలా దాటనిస్తాను. నిన్ను, ఆదిత్యను ఆడుకోవడానికి నాకున్న ఒకే ఒక ఆయుధం దేవి. రాధా.. ఈ సారి నేను వేసే ప్లాన్‌కు నీకు ఊపిరి కూడా ఆడదు. చూస్తూ ఉండు. ఈ క్షణం నుంచి నా టైం స్టార్ట్ అయింది’ అంటూ కళ్లెర్రజేస్తాడు. ఆ తర్వాత.. దేవి, చిన్మయి లంచ్ బాక్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అంతలోనే రాధ బాక్స్ తీసుకుని వస్తుంది స్కూల్‌కి. అన్నం తింటుండగా దేవి తల్లితో నాకోసం ఆఫీసర్ సార్ వచ్చిండు. సారుకు నేనంటే ఎంత ఇష్టమో కదమ్మా.. అంటుంది. అంతలోనే నాకు బుడ్డ రుక్మిణిని చూడాలనుందమ్మా. నేను అవ్వ వాళ్లింటికి వెళ్లొస్తా అంటుంది దేవి.
ఆ తర్వాత మాధవ్ రాధ కోసం దొంగచూపులు చూస్తూ వెతుకుతుంటాడు. అంతలోనే జానకి వచ్చి ఏమైందిరా.. ఎవరి కోసం చూస్తున్నావ్.. అంటే రాధ ఎక్కడుంది అని అడుగుతాడు. లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్‌కి వెళ్లిందని చెబుతుంది జానకి. ‘మాధవా.. నిన్ను ఒకటి అడగలి రా. నువ్ ఇంతకుముందులా ఉండడం లేదు. అక్కడ రాధ కూడా అలానే ఉంది. నువ్వు కానీ ఆ పిల్లని ఏం ఇబ్బంది పెట్టడం లేదు కదా’ అంటుంది జానకి. దాంతో మాధవకి ఎక్కడో కాలుతుంది. నువ్వు రాధ గురించి పట్టించుకోకు. నా గురించి, నాన్న గురించి మాత్రమే ఆలోచించు అంటూ అరుస్తాడు జానకి మీద. రామ్మూర్తి వచ్చి జానకిని ఏమైంది? అంటాడు. ‘మాధవ్ ప్రవర్తన బాగలేదండి. ఇంతకుముందులా ఇంట్లో ఉండడం లేదు. ఏమైందిరా అంటే నీకవసరం లేదు అంటున్నాడు. అక్కడ రాధ కూడా దేనికో ఇబ్బంది పడుతుంది. నేనడిగితే చెప్పడం లేదండి. మీరైనా వాడిని అడిగి చూడండి’ అంటూ భర్తని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు రామ్మూర్తి.. వాళ్లేమైనా చిన్న పిల్లలనుకుంటున్నావా? వాడికి బాధ్యతలు ఉంటాయి. వాడు ఇంతకుముందు కూడా మనతో ఏదీ చెప్పేవాడు కాదు కదా.. ఇక ఆ పిల్ల అంటావా. ఏంటమ్మా అని అడిగితే ఇంట్లోనుంచి వెళ్లిపోతానంటుంది. ఇక నేను మాత్రం ఏం మాట్లాడగలను’ అంటాడు. అది కాదండీ.. ఈ మధ్య ఇద్దరి పద్ధతులు మారాయి. ప్రవర్తనలు మారాయి అంటూ బాధపడుతుంది జానకి. ‘చూడు జానకి.. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వాళ్లు చెప్పాలనుకుంటే చెప్తారు కానీ మనం అడిగితే ఏం చెప్పరు’ అంటుూ సముదాయిస్తాడు రామ్మూర్తి. ఏంటో ఎవకరికి వాళ్లు ఏదీ చెప్పరు. పోనీ ఈయనైనా అడుగుతారంటే నా నోరు మూస్తాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తానికి ఏదో అయితే జరుగుతుందని మనసులో అనుకుంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..