Jalsa Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో జల్సా ఒకటి. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉండటంతో ప్రేక్షకులకు మాగా కనక్ట్ అయిపోయింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, దేవీశ్రీ మ్యాజిక్ మ్యూజిక్ సినిమాను విజయతీరాలకు చేర్చాయి. ఈ సినిమా మళ్లీ నేటి నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్ గురువారం జల్సాను రీరిలీజ్ చేసింది. దీంతో థియేటర్ల వద్ద పవన్ అభిమానులు హోరెత్తిస్తున్నారు. కేవలం ఇండియాకే పరిమితం కాకుండా అమెరికాలోనూ జల్సాను మళ్లీ ప్రదర్శిస్తున్నారు.
అయితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు కర్నూలోని శ్రీరామ థియేటర్‌పై దాడికి దిగారు. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ థియేటర్‌లో జల్సా సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ సినిమా చూసేందుకు అక్కడికి వచ్చారు. అయితే థియేటర్‌లో సౌండ్ సిస్టం సరిగాలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్‌పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Jalsa Movie : వైరల్ అవుతున్న జాతిరత్నాలు సినిమాలోని డైలాగ్..
కాగా.. జల్సా విడుదల సందర్భంగా.. జాతిరత్నాలు సినిమాలోని ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో హీరో నవీన్ పొలిశెట్టి, అతని స్నేహితులకు జల్సా సినిమా విడుదల సమయంలో చేసిన హెల్ప్ గురించి చెప్పే డైలాగ్ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ‘2008 సంవత్సరం 27 మార్చి జల్సా సినిమా విడుదల.. నటరాజ్ థియేటర్ సంగారెడ్డి.. ఆ రోజు మీరు కింద ఉన్నారు.. నేను బాల్కనీలో ఉన్నాను. నేను మిమ్మల్ని ఆ రోజు పైకి తీసుకు రాలేదా’ అనే చెప్పే ఫన్నీ డైలగ్‌ను నవీన్ పొలిశెట్టి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జల్సా సినిమాకు ఉన్న క్రేజ్ మరోసారి ట్రెండ్ అవుతోంది.