దీప, మోనిత గొడవ చూసి కార్తీక్‌కి సందేహం వస్తుంది. మీరెవరా తనకేం అవుతారని ప్రశ్నిస్తాడు. దాంతో మోనిత చెప్పడంతో దీపని అక్కడి నుంచి లాక్కెళ్లి పోతాడు. అనంతరం వాదనలో త్వరలో వచ్చి కార్తీక్‌ని తీసుకెళతా. అప్పటివరకూ డాక్టర్ బాబుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత ఇంటికి వెళ్లి డాక్టర్ అన్నయ్యకి చెప్పగా తన ప్రేమతో డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చే అవకాశం ఉందని చెబుతాడు. అలాగే అని కొత్తగా ఓ ఐడియా వేస్తుంది. అలాగే మోనితకి డాక్టర్ బాబుకి ఆమె మీద ప్రేమ ఉందా లేదా అనే డౌట్ వస్తుంది. దాంతో తెలుసుకునేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 1న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘దీప ఉన్నప్పుడు కార్తీక్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకున్నా. ఇప్పుడు దీప లేదు. దీప జ్ఞాపకాలు లేవు.. ఇప్పుడు తనని నా దారిలోకి తెచ్చుకోవడం చాలా ఈజీ’ అనుకుంటుంది మోనిత. కానీ ప్రేమ ఉందా లేదా అని డౌట్ వచ్చి కావాలనే వేలిని కొరుక్కుని అరుస్తుంది మోనిత. అది విని ఏమైందని కార్తీక్ అడగగా.. వంట చేస్తుంటే కాలిందని మోనిత చెప్పిన పట్టించుకోకుండా.. అవునా అంటూ తన పనిలో పడిపోతాడు. దాంతో ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయినా మోనిత ఏడుస్తూ ‘నన్ను అసలు పట్టించుకోవేంటి. నేను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని. నాకేమైనా నీకు అవసరం లేదా’ అని కార్తీక్ దగ్గర మోనిత పెడబొబ్బలు పెడుతుంది. తనకి అలాంటి ఫిలింగ్స్ ఏం కలగలేదని కార్తీక్ షాక్ ఇస్తాడు. దాంతో.. ‘నీకోసం మన బిడ్డని కోల్పోయాను. అందుకే నువ్వే సర్వస్వం అని బ్రతుకుతున్నా’ అని బ్రతికున్న కొడుకుని చచ్చిపోయినట్లు సులువుగా అబద్ధం ఆడేస్తుంది మోనిత. దీంతో మోనితని దగ్గరకి తీసుకుని ఓదార్చుతాడు కార్తీక్.
మరోవైపు.. డాక్టర్ అన్నయ్యకి, పెద్దావిడకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది దీప. అది తింటూ చాలా బావుందని పొగుడుతూ ఉంటారు. దాంతో వాళ్ల అభిమానం అని అంటుంది దీప. దాంతో.. భార్య చేతి వంట బావుందంటే ఆ భర్త చాలా లక్కీ అని అంటుంది పెద్దావిడ. అది విని పెళ్లైన దగ్గర నుంచి అన్ని కష్టాలే అని అంటుంది దీప. సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్లడం.. రాముడు సముద్రాన్ని దాటి భార్యని తెచ్చుకోవడం గురించి చెబుతుంది పెద్దావిడ. అది విని.. ఇక్కడ శూర్పణక రాముడ్ని ఎత్తుకెళ్లింది.. సీతవైనా నువ్వు నీ భర్తని తెచ్చుకోవాలి అని అంటాడు డాక్టర్ అన్నయ్య. అంతేకాకుండా.. డాక్టర్ బాబుని దారికి తెచ్చుకోవాలంటే నీ చేతివంటని ఒకసారి రుచి చూపించు.. ఆయనే దారిలోకి వస్తాడని సలహా ఇస్తాడు డాక్టర్. కార్తీక్‌కి కూడా తన వంట అంటే చాలా ఇష్టమని.. డాక్టర్ చెప్పినట్లే చేయాలని దీప ఫిక్స్ అవుతుంది.
తర్వాతి సీన్‌లో.. ఆటో నడపడానికి వెళుతున్న వారణాసీ కోసం బాక్స్ కట్టి తీసుకొస్తుంది చంద్రమ్మ. అప్పుడే అక్కడికి వచ్చిన సౌర్య తాను కూడా ఆటో నడపుతూ అమ్మనాన్నని వెతకడానని తను వస్తానని అంటుంది. దాంతో.. ‘నువ్వెందుకు బంగారం వెళ్లడం.. నువ్వు వెళితే తాము పొద్దు ఎలా గడుస్తుంది’ అని ప్రశ్నిస్తాడు ఇంద్రుడు. దాంతో.. హోటల్ పెట్టడానికి అవసరమైన పనులు చూడండని చెబుతుంది సౌర్య. వారణాసీ కూడా తాను అన్ని చూసుకుంటాను రానివ్వండి అంటాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఆటో దగ్గరకి వెళతారు. ఆటో ఎక్కబోతు.. అమ్మనాన్న కనిపిస్తే హిమ మీద నీ కోపం పోతుందా అని అడుగుతాడు వారణాసి. దాంతో ఎప్పటిలాగే అగ్గి మీద గుగ్గిలం అవుతుంది సౌర్య. అయినా నిజంగా అమ్మనాన్న కనిపిస్తే అన్ని బావుంటాయి కదా అని కన్నీరు పెడుతుంది. దాంతో.. సౌర్యని ఓదార్చి ఆటో స్టార్ట్ చేసి వెళ్లిపోతాడు వారణాసి.
అనంతరం.. శ్రీశైలం, సింహచలం, భద్రాచలం అంటూ రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ శివని పిలుస్తుంటాడు కార్తీక్. అంతలో.. డ్రైవర్ పేరు శివ అంటూ అక్కడికి వచ్చిన మోనిత.. ఎక్కడికి వెళుతున్నావని కార్తీక్‌ని అడుగుతుంది. దాంతో.. నువ్వు వంట చేయాల్సిన అవసరం లేకుండా.. నీకోసం వంటలక్కని తీసుకోస్తానని చాలా కూల్‌గా చెబుతాడు కార్తీక్. అది విని ఒక్కసారిగా వెయ్యి వాట్ల షాక్ కొట్టినట్లు షాక్ అవుతుంది మోనిత. నిన్ననే పెద్ద గొడవ చేసింది. అదేం వద్దని కార్తీక్ మీద అరుస్తుంది. ‘అది కాదు.. ఆమెకి నేను డాక్టర్ బాబుని కాదని చెప్పి తీసుకొచ్చి.. ఇక్కడ వంటకి పెడతా. అప్పుడు ఆమె భర్త వేరని తెలుసుకుంటుంది’ అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. అయినా మోనిత వినకపోవడంతో సరేనని వేరే పని మీద బయటికి వెళతాడు. అతను వెళ్లిన తర్వాత.. ‘ఎంత టెన్షన్ పెట్టావు కార్తీక్. అయినా అన్ని మర్చిపోయేవాడు దీపని ఎలా గుర్తుంచుకున్నాడు. అందుకే దీపని కార్తీక్‌ని కలవనివ్వకూడదు’ అని గట్టిగా అనుకుంటుంది.
అనంతరం.. డాక్టర్ అన్నయ్య, పెద్దావిడ, రాంపండు ఎందుకో దిగులుగా ఉంటారు. ఇంతలో బ్యాగ్ పట్టుకుని అక్కడికి వస్తుంది దీప. అది చూసి ఏం చేసిన ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని బ్రతిమిలాడినట్లు అంటాడు డాక్టర్ అన్నయ్య. ‘లేదన్నయ్యా.. అదెంత జిత్తుల మారి నక్కో మీకు తెలియదన్నయ్య. నేను వెళ్లాల్సిందే’ అంటుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.