Megastar Chiranjeevi: కరోనా తర్వాత కాస్త మార్పు వచ్చిందని.. సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. థియేటర్స్‌కు ఎవరూ రావడం లేదని అనుకుంటున్నారని అది తప్పు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సక్సెస్ రేట్ అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉందన్నారు. శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పర్సనల్, ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Megastar Chiranjeevi: నాగబాబుకి ఊపిరి ఆగిపోయేంత పనైంది..
ఇక తనకు ఫస్ట్ డే ఫస్ట్ షో గురించి ఉన్న అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. అయితే ఆ అనుభవాన్ని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని.. చెబితే పరువు పోతుందని చెప్పలేదంటూ సరదాగా ఆయన చెప్పుకొచ్చారు. ‘‘నాకు కూడా ఆ అనుభవం ఉంది. ఎప్పుడూ.. ఎక్కడా చెప్పుకోలేదు.. ఎందుకంటే పరువు పోతుందేమో అని. నెల్లూరులో.. సంవత్సరం గుర్తు లేదు.. నేనప్పుడు ఏడో, ఎనిమిదో చదువుతున్నాను. సినిమా పేరు ఏవీఎమ్ వారి ‘రాము’. ఎన్‌టి రామారావుగారు నటించిన సినిమా. పూర్ణ అని మా చుట్టాలలో ఒకబ్బాయి ఉండేవాడు. వాడికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. వాడితో ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లాము.
నాన్నగారు మమ్మల్ని నేల, బెంచ్ కాకుండా.. కాస్త కుర్చీ రేంజ్‌లోనే సినిమాలు చూపించేవారు. కానీ ఆ రోజు నేలకి వెళ్ళాల్సి వచ్చింది. నాతో పాటు తమ్ముడు నాగబాబు కూడా వచ్చాడు. ఆ సినిమాకి టిక్కెట్స్ తీసుకొనే క్రమంలో మా నాగబాబు (Nagababu)కి ఊపిరి ఆగిపోయేంత పనైంది. బిక్క ముఖం పెట్టేశాడు. అదే సమయంలో మా నాన్న అంతకుముందు షో చూసి వస్తున్నారు. మా పరిస్థితి చూసి.. ఆయన కోపంతో అక్కడ మొదలెట్టి.. ఇంటికి వచ్చేవరకు కొడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ‘ఏవిఎమ్ రాము’ సినిమా అంటే నాకు షివరింగ్ వచ్చేస్తుంది..’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.