సత్యకు ఆదిత్య ప్రవర్తనపై అనుమానం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మరోవైపు మాధవ్ కొత్త ప్లాన్‌తో దేవిని ఆదిత్య నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు. నలుగురిలో ఎందుకు కలవట్లేదంటూ రాధని గుచ్చి గుచ్చి అడుగుతుంటుంది జానకి. ఆ తరువాత ఆగస్టు 26 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం…
‘ఆఫీసర్ మన ఇంటికి వస్తే మాట్లాడుతున్నాం. అలాంటిది వాళ్లమ్మతో మాట్లాడితే తప్పేంటి? నీ భర్త వాళ్లే నువ్ బయటికి రావట్లేదా.. నీ భర్త ఎవరో చెప్పమ్మా?’ అంటూ పలు రకాలుగా ప్రశ్నిస్తుంది జానకి. అయినా రాధ నోరు మెదపదు. అక్కడ మాధవ్ మళ్లీ ఏం చేస్తున్నాడోనని ఆలోచిస్తూ భయపడి వెళ్లిపోతుంది. ఆ తరువాత సీన్‌లో మాధవ్ దేవిని ఇంతకు ముందు ఆదిత్య తీసుకెళ్లిన ఆశ్రమం దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడి పిల్లల పరిస్థితి ఏంటో చూపిస్తానంటూ దేవితో చెప్తాడు మాధవ్. అపుడే ఓ వ్యక్తి రుక్కు, దేవి ఫొటో తీసుకుని వచ్చి ఎక్కడైనా చూస్తే చెప్పండి అంటూ మాధవ్‌ని అడుగుతాడు. అది చూసి మాధవ్ దేవిని పిలుస్తాడు. ఆ వ్యక్తి దేవి తన కూతురేనని అంటాడు. తాగుడుకు బానిసైన నన్ను నా భార్య వదిలిపెట్టి వెళ్లిందని.. కట్టు కథలు చెప్తాడు ఆ వ్యక్తి. మాధవ్ దేవికి నచ్చజెప్పి మీ తండ్రేనని నమ్మిస్తాడు. అతడు దేవి దగ్గర ఎమోషనల్ అవుతూ.. తన తప్పుని ఒప్పుకుంటాడు. మీ నాన్ననమ్మా అంటూ నటిస్తాడు ఆ తాగుబోతు వ్యక్తి.
సరే ఒక్క నిమిషం ఉండు అంటూ మాధవ్ దేవిని పక్కకు తీసుకెళ్తాడు. ‘తల్లీ ఇన్ని రోజులు మీ నాన్న ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియక బాధపడ్డావ్ కదా. అదిగో చూడు మీ నాన్న కనిపించాడు. కానీ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు’ అంటాడు మాధవ్ దేవితో. ఎందుకు అని అడగ్గా.. ‘ఒకరితో చెప్తావ్. వాళ్లు మీ అమ్మతో చెప్తే.. అప్పటిలా మీ నాన్న ఎక్కడ కొడతాడో అని మీ అమ్మ భయంతో పారిపోతుంది. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. నేరుగా మీ అమ్మని తీసుకొచ్చి మీ నాన్నని చూపిద్దాం. అతనే క్షమాపణ చెప్పి ఎలాగూ మీరందరూ కలిసి ఉండేలా చూసుకుంటాడు’ అంటూ నటిస్తాడు మాధవ్. నాయన్ని చూశాక చాలా మాట్లాడాలనుకున్నా. కానీ మాటలు రావట్లేదు అంటూ బాధపడుతుంది దేవి. పాపంలే తల్లి. నువ్ మీ నాన్న మీద కోప్పడితే ఎలా. ఇప్పటికే ఎలా అయిపోయాడో చూడు అంటూ ఆ తాగుబోతు వ్యక్తిని చూపిస్తాడు మాధవ్.
‘అమ్మా ఇంతకాలానికి నువ్ నాకు కనిపించావ్. నువ్వే నన్ను మీ అమ్మను కలపాలి. తల్లీ.. నన్ను చూసి మీ అమ్మ నేనెవరో తెలియదంటుంది. నన్ను తన భర్తని కాదు అన్నా అంటుంది. నేను అప్పట్లో తనను అంతగా బాధపెట్టాను తల్లీ’ అంటూ దేవిని దగ్గరికి తీసుకోబోతాడు. అంతలోనే మాధవ్ కలగజేసుకుని ముందు రాధ నిన్ను క్షమించాలి. తర్వాతే దేవి నీ దగ్గరకు వస్తుంది అని చెప్తూ వెళ్లిపోతుంటారు ఇద్దరూ. ఆ వ్యక్తి ఏడుస్తూ దేవినే చూస్తుంటాడు. అంతలోనే మాధవ్, ఆ వ్యక్తి ఇద్దరూ చూసుకుంటూ తమ ప్లాన్ సక్సెస్ అయినట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత సీన్‌లో రాధ భోజనానికి ఏర్పాట్లు చేస్తుండగా అక్కడికి వెళ్తుంది దేవి. తల్లినే పదే పదే చూస్తూ బాధపడుతుంది. తండ్రిలా నటించిన ఆ తాగుబోతు వ్యక్తి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. ‘స్కూల్ అపుడే వదిలిపెట్టారా.. చిన్మయి ఎక్కడుంది బిడ్డా.. ఏమైంది బిడ్డా..అట్లున్నవ్’ అంటూ వరుస ప్రశ్నలు సంధిస్తుంది రాధ. తల్లిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అవుతుంది దేవి. అది చూసి రాధకు అనుమానం కలుగుతుంది. మాధవ్ సారూ పరీక్షలన్నడు.. ఏమో అన్నడు.. ఏం చేసిండో.. నా బిడ్డ మనసులో మళ్ల ఏం విషం నింపిండో.. అని ఆలోచిస్తుంది రాధ.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్య స్కూల్ ముందుకు వెళ్లి నిల్చుంటాడు. చిన్మయి అంకుల్ అంటూ వెళ్తుంది ఆదిత్య దగ్గరికి. దేవి ఎక్కడమ్మా.. అని అడగ్గా తను ఈ రోజు స్కూల్‌కు రాలేదని చెబుతుంది చిన్మయి. అదేంటి ఎందుకు రాలేదని ప్రశ్నించగా.. నాన్న నన్ను ఇక్కడ వదిలేసి చెల్లెల్ని ఎక్కడికో తీసుకెళ్లాడు అని చెబుతుంది. ‘చిన్మయిని వదిలేసి దేవిని మాత్రమే తీసుకెళ్లాడంటే ఎందుకు తీసుకెళ్లుంటాడు. మళ్లీ దేవి మనసు పాడు చేసుంటాడా’ అని మనసులో అనుకుంటాడు ఆదిత్య. అంతలోనే రుక్మిణి ఫోన్ చేస్తుంది. పెనిమిటి దేవమ్మా ఇపుడే ఇంటికి వచ్చింది. ఏదోలా ఉంది. నన్ను చూసి ఏడ్చింది. ఏమైందని అడిగితే చెప్పట్లేదు. ఆ మాధవ్ సారు మళ్ల ఏం చేసిండోనని ఆందోళన పడుతూ చెబుతుంది రాధ. ఆ మాధవ్ ఎక్కడికి తీసుకెళ్లాడో నేను తెలుసుకుంటాలే అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య. ఆ తర్వాత సీన్‌లో లోలోపల సంబరపడుతున్న మాధవ్ దగ్గరికి వస్తుంది జానకి. ‘ఏం చేస్తున్నావ్ రా నువ్ అసలు. ఇద్దరిని స్కూల్‌కని తీసుకెళ్లావ్. కానీ చిన్మయిని స్కూల్లో వదిలేసి దేవిని మాత్రమే ఎక్కడికి తీసుకెళ్లావ్ రా. కనీసం రాధకు గానీ, నాకు గానీ ఒక్కమాటైనా చెప్పలేదేంటి’ అని కోప్పడుతుంది జానకి. మరి మాధవ్ అసలు బండారం బట్టబయలు కాబోతుందా.. జానకి అనుమానాలకు మాధవ్ ఏం సమాధానమిస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.