కమల బిడ్డను రుక్మిణి కిటికీలోనుంచి చాటుగా చూసి సంబరపడుతుంది. బిడ్డని ఎత్తుకోలేకపోయానని బాధపడుతుంది. మరోవైపు రాధను టార్గెట్ చేసుకున్నమాధవ్ రోజూ సతాయిస్తూనే ఉంటాడు. సత్యకు పిల్లలు లేరని తల్లిడిల్లిపోతారు అత్తామామలు. కమల బిడ్డ బారసాలకు రాధని కూడా రమ్మని పిలుస్తుంది భాగ్యమ్మ. ఆ తరువాత ఆగస్టు 20 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘నాయన పాస్ కావాలని ఆశీర్వదించి ఓ ముద్ద పెట్టు’ అని జానకికి చెబుతుంది దేవి. అపుడు మాధవ్ ‘చూశావా అమ్మా.. దేవి కూడా నాకే సపోర్ట్ చేస్తుంది. పాస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ పెట్టమ్మా’ అంటాడు. ముద్ద పెడుతుండగానే జానకికి ఫోన్ వస్తుంది. అటువైపు నుంచి దేవుడమ్మ మాట్లాడుతూ ‘మా కమలకి పాప పుట్టింది. రేపు బారసాల చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి’ అని రామ్మూర్తి కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. దానికి జానకి వస్తాం అని చెప్పగా.. ఆ పెద్దమనిషి దేవమ్మ ఉందా అని అడుగుతుంది దేవుడమ్మ. జానకి ఇదిగో ఇస్తున్నా అంటూ ఫోన్ దేవికి ఇస్తుంది. ‘దేవుడమ్మవ్వ ఎలా ఉన్నావ్’ అని దేవి పలకరించగా ‘నువ్వెలా ఉన్నావే చిట్టి రాక్షసి. కమల పెద్దమ్మకి ఇంకా పాప పుట్టలేదా అని అడిగేదానివి కదా. పాప పుట్టింది. రేపు పాపకి బారసాల చేస్తున్నాం. మీరందరూ రావడమే కాదు. మీ అమ్మని కూడా తప్పకుండా తీసుకురావాలి’ అని పిలుస్తుంది దేవుడమ్మ. తప్పకుండా మాయమ్మని తీసుకొస్తానని మాటిస్తుంది దేవి.
దేవుడమ్మతో దేవి చెప్పిన మాటలన్నీ పక్కనే ఉండి వింటుంది రాధ. వెంటనే ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి రుక్మిణి ఈ టైంకి ఫోన్ చేశావ్.. చెప్పు అనగా ‘ఒక ముచ్చట చెప్పాలి. రేపు బారసాల చేస్తున్నారు కదా. నన్ను కూడా పిలిచింది. ఈ ఒక్కసారి నాకు కూడా రావాలనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడూ అత్తమ్మకు ఎదురుపడలే కానీ ఇపుడు కమలక్క బిడ్డని చూడాలనిపిస్తుంది’ అంటుంది. కానీ ఎలా రుక్మిణి.. నువ్ ఇంటిదాక వస్తే ఎవరో ఒకరు చూస్తారు కదా అంటాడు ఆదిత్య. ‘నేను ఇంట్లో నుంచి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి వేడుక. కమలక్క కూతురిని నేను ఎలాగైనా చూడాలి. ఇంటికి వచ్చి అందర్నీ చూస్తా. ఆ ముచ్చట చెప్పాలనే నీకు ఫోన్ చేసిన పెనిమిటి’ అని ఎమోషనల్‌గా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రుక్కు.
మరుసటి రోజు ఉదయమే దేవుడమ్మ ఇంట్లో బారసాల పనులు మొదలవుతాయి. అందరూ పనుల హడావుడిలో ఉంటారు. అది చూసి కమల భావోద్వేగానికి లోనవుతుంది. ఫంక్షన్‌కి వచ్చిన వాళ్లకు ఏ లోటు రాకుండా చూడాలని శాసిస్తుంది దేవుడమ్మ. అపుడే అక్కడికి వచ్చిన ఆదిత్యతో ‘ఏరా ఆదిత్య. ఏర్పాట్లు ఎలా ఉన్నాయ్’ అని అడుగుతుంది. నీకు పేరు పెట్టగలమా అమ్మ అంటాడు కొడుకు. ‘ఇది కమల బిడ్డ బారసాల కాదు. నా మనమరాలు బారసాల. రుక్మిణికి బిడ్డ ఉందంటున్నారు. కానీ నేను ఏ ఫంక్షన్ చేయలేకపోయా. అందుకే ఈ వేడుక ఘనంగా చేస్తున్నాం. రామ్మూర్తి వాళ్లకి ఫోన్ చేసి అందర్నీ రమ్మని పిలిచా. దేవితో వాళ్లమ్మని తప్పకుండా తీసుకురమ్మని చెప్పా’ అంటూ జరిగింది చెబుతుంది కొడుకుతో.
దేవుడమ్మ దంపతులకు కమల బిడ్డతో ఎదురవుతుంది. ఏంటమ్మా.. అని అడగ్గా ‘ఎందుకమ్మా మాపై ఇంత అభిమానం. మాకు నీడనిచ్చి, నా పెనిమిటికి ఉద్యోగమిచ్చి, నా బిడ్డ బారసాల ఇంత ఘనంగా చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి’ అంటూ ఎమోషనల్ అవుతుంది కమల. అపుడు ‘నువ్ పరాయిదానివి కాదు. నా కోడలు రుక్మిణికి అక్కవు. రుక్మిణి ఇంట్లోకి వచ్చాకే ఈ దేవుడమ్మ మారింది. రుక్కు ఈ ఇంటి దేవత. మీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఒకరంటే ఒకరికి ప్రాణంగా బతికారు. అలాంటిది మిమ్మల్ని విడదీయను’ అంటూ పొగడుతుంది దేవుడమ్మ. ఈ ఇంట్లో బిడ్డ కేరింతల కోసం ఎంతో ఎదురు చూశాం. ఈ బిడ్డలో రుక్మిణి బిడ్డని చూసుకుంటున్నాం అంటుంది.
మరుసటి రోజు ఉదయమే బారసాల వేడుక స్టార్ట్ అవుతుంది. దేవుడమ్మ, తన భర్త ఫంక్షన్‌కి వచ్చే వారందరికి స్వాగతం పలుకుతూ బయట నిల్చుంటారు. అక్కడే ఉన్న ఆదిత్య రుక్మిణి గురించి ఆలోచిస్తాడు. అది గమనించిన దేవుడమ్మ.. ఏంట్రా ఆదిత్య. ఎవరి కోసం చూస్తున్నావ్? అంటుంది. వెంటనే ఆదిత్య దేవి వాళ్లు వస్తానన్నారు కదా అందుకే చూస్తున్నానంటూ మాట మారుస్తాడు. వాకిలి వరకు వచ్చిన వాళ్లు ఇంట్లోకి రాకుండా పోతారా? అంటూ ఆదిత్యని లోపలికి తీసుకెళ్తుంది.
మరోవైపు జానకి, రామ్మూర్తి, చిన్మయి ఫంక్షన్‌కు బయలుదేరడానికి రెడీ అయి దేవి కోసం ఎదురుచూస్తారు. అక్కడ రాధ కమల, బిడ్డ, భాగ్యమ్మ మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. అంతలోనే దేవి వచ్చి ‘అమ్మా.. మేమందరం రెడీ అయినం పోదాం పద’ అంటుంది. అపుడు రాధ మీరు పోండి దేవమ్మా అనగా అదేంటి.. అవ్వ నిన్ను తీసుకరమ్మని చెప్పింది కద. నువు రాకుంటే ఎట్ల. కమల పెద్దమ్మకు చిన్నబిడ్డ పుట్టిందట. నీకు చూడాలని లేదా.. అంటూ రాధని ఇబ్బంది పెడుతుంది. ఉంది బిడ్డ ఎందుకు ఉండదు అని రాధ అనగా మరి జల్దీ రా.. వెళ్దాం అంటుంది దేవి. నేనొస్తా. ముందు మీరు పోండి అని రాధ చెప్పగా.. నువ్ అట్లనే వస్తా అంటావ్, కానీ రావు అంటుంది దేవి. దానికి బదులుగా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అవి చక్కబెట్టి నేనొస్తా. మీరు పోండి అంటుంది రాధ. ‘అవ్వ నిన్ను ఎట్లయిన తీసుకురమ్మని చెప్పింది. నేను తీసుకొస్తానని మాటిచ్చినా’ అని దేవి అనగా.. నేనొస్తా నువ్ పో. అక్కడ నీకోసం అవ్వ, ఆఫీసర్ సార్, చిన్నమ్మ ఎదురు చూస్తుంటారు అంటుంది రాధ కన్నీళ్లతో. నువ్ రాకపోతే అవ్వ పరేషాన్ అవుతదని దేవి చెప్పగా.. నిన్ను చూడగానే చల్లబడతది కానీ నువ్ వెళ్లు బిడ్డ అంటూ దేవిని సముదాయిస్తుంది రాధ. ఎప్పుడూ ఇంతే నువ్ అంటూ కోపంగా వెళ్తుంది దేవి.
ఫంక్షన్‌కి వెళ్లడానికి రెడీగా ఉన్న చిన్మయి.. అమ్మ వస్తుందా అని దేవిని అడగ్గా.. తర్వాత వస్తదట అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి బయలుదేరుతారు. జానకి రాధని చూసి ‘ఏదో కలివిడిగా ఉంటుంది. ఇదివరకులా ఉండట్లేదు. తన మనసులో ఏముందో తెలుసుకోవాలి’ అనుకుంటుంది. ఆ తరువాత ఏం జరగనుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.