ఈ మధ్య కాలంలో విచిత్రమైన వివాహాలు ఎక్కువ అయిపోయాయి. పాశ్చాత్య నాగరికత ప్రభావంతో విశృంఖలమైన స్వేచ్ఛని కోరుకునే వారు ఎక్కువ అయిపోయారు. స్వేచ్ఛ పేరుతో పెరిగిపోయిన విచ్చలవిడితనం, దానికి మరల పౌర హక్కులు అనే మాట పట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఒకే జెండర్ ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. ప్రేమ ఆడ, మగ వారి మధ్యనే పుట్టాలని లేదు కదా. ప్రేమకి అవధులు లేవు, హద్దులు లేవు అని అంటున్నారు. ప్రేమించుకున్న స్టేజి దాటిపోయి కలిసి బ్రతకడం, పెళ్లి చేసుకొని వివాహబంధంతో ఒకటి కావడం కూడా జరుగుతుంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించేవారు కూడా ఎక్కువ అయ్యారు.
ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ అమ్మాయి తనని తాను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. తనకి మగవాడి తోడు అవసరం లేదని, నాతో నేను బ్రతకాలని అనుకుంటున్నట్లు చెప్పింది. అలాగే శారీరక సుఖం కోసం కూడా మగవాడి అవసరం లేదని తెలియజేసింది. ఆమె పెళ్లిని కొంత మంది సంప్రదాయ వాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే చివరికి ఆమె అనుకున్నట్లే తనని తాను పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ హిందీ హీరోయిన్ కూడా ఇలాగే తనని తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటి కనిష్క సోని తనని తాను పెళ్లి చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
మాట మీద నిలబడే మగవాడు తన జీవితంలో కనిపించలేదని, శృంగారం కోసమే అయితే మగవాడి అవసరం లేదని తన అభిప్రాయాన్ని కూడా ఆ పోస్ట్ లో వ్యక్తం చేసింది. ఈ కారణంగానే తనతో తాను బ్రతకాలని నిర్ణయించుకొని నన్ను నేనే పెళ్లి చేసుకున్నా అని చెప్పి సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో కనిష్క నిర్ణయాన్ని గౌరవించి మద్దతు చెబుతూ కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు ఆమె అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారు. ఏది ఏమైనా స్వేచ్చా భారతంలో ఒకరి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు కాబట్టి కనిష్క సోని నిర్ణయంపై చాలా మంది విషెస్ చెబుతున్నారు.