Youtube Channels : తాజాగా కేంద్రం మరోమారు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్రం పేర్కొంది. బ్లాక్ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్ పాకిస్తాన్‌కు చెందినది. కేంద్రం అంతకు ముందు కూడా 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్‌ను బ్లాక్ చేసింది.
ఇక గత ఏడాది డిసెంబర్ నుంచి సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కి చేరుకుంది. ఈ ఛానళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజల మెదళ్లలోకి జొప్పిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తాజాగా బ్లాక్ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్.. దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి. కాగా, ఈ ఛానల్స్ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Youtube Channels : టిక్‌టాక్ మోజులో పడి ఎన్నో కుటుంబాలు నాశనం..
దాదాపు 2020 నుంచి కేంద్రం ఇలా ఛానళ్లపై కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని గేమ్స్‌ను సైతం నిషేధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్ వంటి యాప్స్‌ను కూడా కేంద్రం బ్యాన్ చేసింది. ఈ టిక్‌టాక్ మోజులో పడి ఎన్నో కుటుంబాలు నాశనమవగా.. మరెందరో ప్రాణాలు తీసుకున్నారు. 2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సోషల్ మీడియా అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు.