Bigbull : భారత స్టాక్ మార్కెట్ మాంత్రికుడు, ‘బిగ్ బుల్’గా పేరొందిన ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (62) నిన్న కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ముంబైలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రమే ఝున్‌ఝున్‌వాలా అంత్యక్రియలు పూర్తయ్యాయి. బిగ్‌బుల్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Bigbull : ఆయనొక ట్రెండ్ సెట్టర్..
దేశీయ స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన జన్మించింది హైదరాబాద్‌లోనే కావడం విశేషం. రాజస్థానీ కుటుంబానికి చెందిన రాకేష్ విద్యాభ్యాసమంతా ముంబైలోనే జరిగింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లో 1985లో ఒక బంధువు నుంచి రూ.5,000 అప్పు తీసుకుని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అపర కుబేరుడిగా మారారు. అనతి కాలంలోనే పరిస్థితి ఎలా మారిందంటే.. ఆయన ఫలానా కంపెనీ షేర్లు కొన్నారని తెలిస్తే వెంటనే ఆ షేర్లలో ర్యాలీ ప్రారంభమయ్యేది. తర్వాతర్వాత స్టాక్ మార్కెట్ చూపే ఝున్‌ఝున్‌వాలా వైపు తిరిగింది. తన పేరులో మొదటి రెండు అక్షరాలు, తన భార్య పేరులోని తొలి రెండక్షరాలతో రేర్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేశారు.
టాటా టీతో జాక్‌పాట్..
రూ.5 వేలతో మొదలైన బిగ్‌బుల్ ప్రస్థానం నేడు రూ.46 వేల కోట్లకు చేరుకుంది. ఝున్‌ఝున్‌వాలా స్టాక్ మార్కెట్ జైత్రయాత్ర టాటా టీతో ప్రారంభమైంది. 1986లో ఆయన ఈ షేర్లను ఒక్కోటి రూ.47 చొప్పున 5,000 కొనుగోలు చేశారు. మూడు నెలలు తిరక్కుండానే ఈ షేరు ధర రూ.143కు చేరింది. మూడేళ్లు తిరిగే సరికి ఆయన పెట్టుబడుల విలువ రూ.20-25 లక్షలకు పెరిగింది. అలాగే సెసా అనే ఒక గోవా కంపెనీ షేరు బిగ్‌బుల్‌కు భారీ లాభాలను అందించింది. రూ.27కు కొనుగోలు చేసిన ఈ షేరును ఆయన రూ.1,400కు వచ్చే వరకూ ఉంచుకుని భారీ లాభాలకు అమ్మారు. ప్రస్తుతం ఆయన పోర్ట్‌ఫోలియోలో 36కు పైగా కంపెనీలున్నాయి. టాటా గ్రూప్ కంపెనీ టైటాన్‌లో పెట్టుబడి పెట్టడం ఆయనకు బాగా కలిసొచ్చింది. ఈ కంపెనీ ఈక్విటీలో ఆయనకు ఇప్పటికీ 5.05 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ షేర్ల విలువ రూ.11,000 కోట్లు. వీటికి తోడు ఇండియన్ హోటల్స్, కరూర్ వైశ్యా బ్యాంక్, క్రిసిల్, ఆప్టెక్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్ వంటి కంపెనీల షేర్లలోనూ ఝున్‌ఝన్‌వాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ఇటీవలే ఆకాశ ఎయిర్‌ను సైతం ప్రారంభించారు. గత ఏడాది ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన భారత సంపన్నుల జాబితాలో 430 కోట్ల డాలర్ల సంపదతో 36వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 580 కోట్ల డాలర్లతో 22వ స్థానానికి ఎగబాకారు. మరోవైపు ఏటా ఆయన తన సంపాదనలో 25 నుంచి 30 శాతం వరకు దాతృత్వ కార్యకలాపాల కోసం కేటాయిస్తూ వస్తున్నారు.