Nagarjuna : సీతారామం మూవీ… ఎలాంటి అంచనాలూ లేవు. ఓ రేంజ్‌లో పబ్లిసిటీ కూడా లేదు. అయినా సరే బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తుంది. కేవలం ఓరల్ టాక్‌తోనే ఈ సినిమా దుమ్మురేపింది. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు తెలుగు ప్రేక్షక లోకం ఫిదా అయింది. సర్వత్రా ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా.. క్రేజీ బ్యూటీ రష్మిక మందన కీలక పాత్రలో కనిపించింది. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది.
ఈ థాంక్యూ మీట్‌కు ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్.. చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధించినందుకు అశ్వినీ దత్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దత్తు కంటే తాను స్వప్న, ప్రియాంకను ఎక్కువగా ప్రేమిస్తానని.. వారు మహానటి, జాతిరత్నాలు, సీతారామం సినిమాలను రూపొందించి వైజయంతీ మూవీస్ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక ఆ తరువాత మృణాల్ గురించి మాట్లాడుతూ.. సీతారామంలో సీతా మహాలక్ష్మీ రోల్ చేసిన మృణాల్‌ను చూసి ప్రేమలో పడ్డానన్నారు. అమలతో కలిసి ఈ సినిమా చూస్తూ ఎవరీ ఈ అమ్మాయి.. ఇంత అందంగా ఉందని పదే పదే అడిగానని నాగార్జున చెప్పడం ఆసక్తికరంగా మారింది.
Nagarjuna : దుల్కర్‌ను చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపించింది..
సీత పాత్రలో మృణాల్‌ను చూపించిన విధానం అద్భుతంగా ఉందని, సీత పాత్రకు వాడిన కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయని నాగ్ అన్నారు. దుల్కర్ సల్మాన్ గొప్ప ఛార్మింగ్ ఉన్న నటుడు అని చెబుతూ.. దుల్కర్‌ను చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపించిందన్నారు. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ అద్భుతం అని నాగ్ ప్రశంసించారు. కథలోకి మతాన్ని తెచ్చి ఆకట్టుకోవడమే గాక ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారని చెప్పారు. ఇలాంటి థాట్ ప్రాసెస్‌తో సినిమా తీయడానికి ధైర్యం కావాలని, ఇంతంటి సృజనాత్మక సినిమాను చూసి చాలా రోజులైందని నాగ్ చెప్పుకొచ్చారు.