తెలుగు టెలివిజన్ పై కార్తీకదీపం సీరియల్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలం పాటు అద్భుతమైన రేటింగ్స్ తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని సినిమాలకి సైతం పోటీ ఇచ్చింది కార్తీక దీపం సీరియల్. కేవలం మహిళలనే కాకుండా పురుషులనికూడా ఈ సీరియల్ ఆకర్షించింది. భార్యభర్తల అనుబంధంతో నడిచిన ఈ సీరియల్ కథలో ఎపిసోడ్స్ ని దర్శకుడు చాలా ఇంటరెస్టింగ్ గా నడిపించాడు. ఇందులో టైటిల్ రోల్ పోషించిన ప్రేమి విశ్వనాథ్, విలన్ గా నటించిన శోభ శెట్టికి సినిమా హీరోయిన్స్ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. ఒక విధంగా వీరిద్దరిని ఈ సీరియల్ స్టార్స్ ని చేసింది. ఇక హీరోగా నటించిన నిరుపమ్ కి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఐదు నెలల క్రితం ఈ సీరియల్ లో ట్విస్ట్ ఇచ్చి కార్తీక్, దీప చనిపోయినట్లు చూపించి జెనరేషన్ మార్చేసి శౌర్య, హిమ పెద్దవాళ్ళు అయిన తర్వాత స్టోరీతో ఒక 150 ఎపిసోడ్స్ వరకు నడిపించారు.
సీరియల్ టైటిల్ పాత్రలైన కార్తిక్, దీప చనిపోయిన తర్వాత స్టోరీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. ఒకప్పటి స్థాయిలో రేటింగ్స్ కూడా రావడం లేదు. దీంతో సీరియల్ దర్శక నిర్మాతలు ఇప్పుడు మళ్ళీ స్టోరీని మార్చేసి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రేమి విశ్వనాథ్ తన యూట్యూబ్ లో క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇందులో మెయిన్ విలన్ రోల్ చేసిన శోభ శెట్టి కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ లో కార్తీక దీపం రీఎంట్రీ అంటూ వీడియో చేసింది. ఈ వీడియోలో తాను కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేయడంతో చూచాయగా సీరియల్ దర్శక, నిర్మాతలతో కూడా మాట్లాడి కథని చెప్పించే ప్రయత్నం చేసింది.
సీరియల్ కథని మరల ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లి కార్తిక్, దీపలు బ్రతికి వచ్చినట్లు చూపించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మోనిత కొడుకు కూడా పెద్దవాడు అయినట్లు చూపించనున్నట్లు చెప్పేసారు. అలాగే ఇప్పుడున్న శౌర్య, హిమ, నిరుపమ్, ప్రేమ్ చిన్నప్పటి పాత్రలు కొనసాగుతాయని, వాటితో పాటుగా ఆక్సిడెంట్ తరువాత ఏం జరిగింది అనేది కథలో చూపించబోతున్నట్లు తెలిపారు. మొత్తానికి కార్తీకదీపంలో పాత పాత్రలని మరల ప్రవేశపెట్టి కథా గమనం మార్చడం ద్వారా ఈ సీరియల్ ఫ్యాన్స్ ని, ఒకప్పటి రేటింగ్స్ కి తిరిగి సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది చూడాలి.