Congress : కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్నంత రచ్చ మునుపెన్నడూ జరగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హవాయే వేరు. అప్పటి హేమాహేమీలు పార్టీని ఒక్కమాటపై ఉండి నడిపించారు. రాష్ట్రం విడిపోయిన అనంతరం టీ కాంగ్రెస్ నేతలు అధికారం కోసం పోటీ పడటం తప్ప జనాల్లోకి వెళ్లింది లేదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై గళమెత్తింది లేదు. ఇలా అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోతుందని భావించిన అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. అప్పటి నుంచి రచ్చ మరింత ఎక్కువైంది. రేవంత్‌కు ఎవ్వరూ సహకరించకపోగా.. ఆయన చేయవద్దన్న పనులు పనిగట్టుకుని మరీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పార్టీలో కీలక నేతలు రాజీనామాల బాట పట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్‌లు రాజీనామా చేశారు. లైన్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వెంకటరెడ్డి.. రేవంత్ రెడ్డి మొహం కూడా చూడబోనంటూ చేసిన వ్యాఖ్యాలు ఈ వార్తలను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాను 21న బీజేపీలో చేరబోతున్నానని.. అదే రోజున తనతో పాటు చాలా మంది బీజేపీలో చేరతారంటూ వెల్లడించారు. మొత్తానికి బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తోంది. తమ పార్టీలో చేరబోయే నేతల లిస్ట్‌తో తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవల హస్తినకు వెళ్లి అధిష్టానానికి చూపించినట్టు తెలుస్తోంది.
Congress : నేతలంతా పార్టీని వీడితే కొత్త వారికి అవకాశం
అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి తెరదీసింది. దీనిలో భాగంగా మరికొద్ది రోజుల్లో మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీకి మంచే చేస్తుందని క్యాడర్ భావిస్తోంది. ఈ నేతలంతా పార్టీని వీడితే కొత్త వారికి అవకాశం వస్తుందని.. వారంతా కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తారని నమ్ముతున్నారు. ఇప్పుడున్న కీలక నేతలంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తీవ్ర సమస్యల్లోకి నెట్టివేస్తున్నారని.. కొత్తవారు పార్టీకి తిరిగి జవసత్వాలు తీసుకొస్తారని నమ్ముతున్నారు. మున్ముందు పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి.