Samantha : ఇప్పటి వరకూ అంటే హీరో నాగచైతన్య, సమంతల గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరు చెప్పినా ‘వారిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. మాకు తెలిసి వారి మధ్య గొడవలేం లేవు’ అనే చెబుతున్నారు. కానీ వారిద్దరి మధ్య జరిగింది చిన్న గొడవలేం కావు.. పెద్ద వారే జరిగిందని సమంత మాటలను బట్టి తెలుస్తోంది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో అమ్మడు చైతూతో తన రిలేషన్ బ్రేకప్ గురించి మాట్లాడింది. అసలు ఈ షో కోసం చాలా రోజులుగా వీరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ షో ఎట్టకేలకు గురువారం రాత్రి ప్రసారమైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి ఈ షోకి వచ్చి సమంత కనువిందు చేసింది.
Samantha : భర్త కాదు.. మాజీ భర్త
ఇక ఈ ‘కాఫీ విత్ కరణ్’ షోలో సమంత మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ‘ఊ అంటావా మావ’ అంటూ అక్షయ్‌తో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన సామ్.. ఆ తరువాత చైతూతో తన రిలేషన్ విషయానికి వచ్చేసరికి హాట్ వ్యాఖ్యలే చేసింది. చైతన్యతో విడాకుల తర్వాత పరిస్థితి, ట్రోలింగ్ గురించి కరణ్‌తో చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా సమాధానమిచ్చారు. మాటల మధ్యలో కరణ్ ‘నీ భర్త’ అనగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా ‘మాజీ భర్త’ అంటూ కరెక్ట్ చేసింది. అంతటితో అయిపోతే పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు కానీ ఆమె మాట్లాడిన మాటలు ఓ రేంజ్‌లో చైతూతో గొడవలు జరిగాయని చెప్పకనే చెబుతున్నాయి.
ప్రస్తుతం చైతూతో ఎలాంటి రిలేషన్ ఉందని కరణ్‌ను ప్రశ్నించగా.. ‘‘మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే.. ఆ గదిలో కత్తులు వంటి వస్తువులను దాచేయాలి. మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో సైతం మా మధ్య స్నేహపూర్వక సంబంధాలేమీ ఉండే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి మా ఇద్దరి మధ్య రిలేషన్ ఇదే’’ అని సమంత చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన వార్తలను సైతం సామ్ కొట్టిపడేసింది. విడాకుల అనంతరం 250 కోట్లు భరణం తీసుకున్నాననీ, పెళ్లికి ముందు అగ్రిమెంట్ రాసుకోవడం వల్ల భరణం రాలేదని ఇలా.. ఏవేవో రాతలు, ట్రోలింగ్ చూశాను. నేను చదివిన గాసిప్పులో ఇవే చెత్తవి. విడాకుల వల్ల నేనేమీ అప్‌సెట్ కాలేదని సామ్ చెప్పుకొచ్చింది.