Jagan : అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. హోదా అని కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలకు తేలేమని చెప్పలేరు. హోదా నై.. గీదా నై అని కేంద్రం మరోమారు తేల్చి చెప్పినా మిన్నకుండటమే తప్ప మారు మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే మోదీ ఎక్కడ తన కేసులన్నీ తిరగతోడుతాడేమోననే భయం.. మిన్నకుంటే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేస్తున్నాయి. గట్టిగా ప్రజల్లోకి నాటి ఎన్నికల సమయంలో తీసుకెళ్లిన అంశాలను లేవనెత్తి ప్రతిపక్షాలు జగన్‌ను చెడుగుడు ఆడేస్తున్నాయి. మొత్తంమీద జగన్ మాత్రం గట్టిగానే ఇరుక్కుపోయారు.
Jagan : 22 మంది ఎంపీలున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి
సీఎం జగన్ విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై మాటల తూటాలు పేల్చారు. కేంద్రం మెడలు వంచి మరీ సాధిస్తామంటూ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. తన చేతిలో 22 మంది ఎంపీలున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏం చేసినా తన కేసులన్నీ ప్రధాని మోదీ తిరగతోడుతారనే భయం పట్టుకుందో ఏమో కానీ మిన్నకుండిపోయారు. దీంతో విపక్షాలు హోదా’పై పులివెందుల పులిలా రాష్ట్రవ్యాప్తంగా గాండ్రించిన జగన్.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో భారీ విజయం సాధించి ‘తాడేపల్లి’కి చేరిన తర్వాత పిల్లిలా మారిపోయారని బాహాటంగానే విమర్శిస్తున్నాయి.
ఒకవైపు రాష్ట్రంలో ఉద్యోగులంతా జగన్ సర్కారుకు వ్యతిరేకమయ్యారు. టైమ్‌కి జీతాలిచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఉద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రోడ్లన్నీ గోతులమయం. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏపీ రోడ్ల దుస్థితిని ఎండగడుతున్నారు. మరోవైపు ఉచిత పథకాలతో కొందరికి మాత్రమే లబ్ది చేకూరింది. దీంతో మిగిలిన అన్ని వర్గాలూ జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. సర్వేలు సైతం జగన్‌ను చెత్త సీఎంగా పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో హోదా అంశం ఆయన మెడకు చుట్టుకోనుందనే టాక్ కూడా భారీగానే నడుస్తోంది. పైగా హోదా ఇచ్చేదే లేదు అని తేల్చి చెబుతున్నప్పటికీ బీజేపీకి సపోర్టుగా నిలవడం జగన్‌కు మరో మైనస్. ఇప్పటికే జగన్‌కు అటు సుప్రీంకోర్టు.. ఇటు హైకోర్టు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో హోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్రం తేల్చి చెప్పి ఆయనకు షాక్ ఇచ్చింది. వెరసి వచ్చే ఎన్నికల్లో జగన్ పరిస్థితి కొంచెం కష్టమేనని ఏపీ ప్రజానీకం అంటోంది.