viral News : చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను ఫాలో అయ్యారో ఏమో కానీ.. రూ.11 లక్షల విలువైన కారు రిపేరుకు రూ.22 లక్షలవుతుందని సదరు కారు సర్వీసింగ్ సెంటర్ అంచనా లెటర్ ఇవ్వడం షాకింగ్‌గా మారింది. ఇది టూమచ్ అనిపిస్తోంది కదా.. అసలు ఇదెలా సాధ్యం? అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా..? సర్వీసింగ్ సెంటర్ తలుచుకుంటే బిల్లుకు కొదువా? ఎంత కావాలంటే అంత ఏసి పడేస్తుంది. మరీ డబులా? అని ఈ వార్త చదివే వాళ్లే ఆశ్చర్యపోతే ఆ కారు యజమాని ఎంత అవాక్కవ్వాలి?
ఇటీవల బెంగుళూరును వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వరదల దెబ్బకు ఎన్నో ఇళ్లే కాదు.. వాహనాలు సైతం పాడయ్యాయి. అలా పాడైపోయిన తన వోక్స్ వ్యాగన్ కారును సదరు కారు యజమాని అనిరుథ్ గణేష్ వోక్స్ వ్యాగన్ సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన కారు రిపేర్ కోసం సర్వీసింగ్ సెంటర్ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేషన్ స్లిప్ చూసి అవాక్కయ్యాడు. కారణం.. ఏదో సినిమాలో ఆమని చెప్పినట్టు.. పావలా వ్యాపారానికి రూపాయి కోడిపిల్లను దిష్టి తీసినట్టు.. రూ.11 లక్షల విలువైన వోక్స్‌వాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారును రిపేర్ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని సర్వీసింగ్ సెంటర్ ఎస్టిమేషన్ స్లిప్‌లో పేర్కొనడమే.
ఆ స్లిప్‌తో సహా తను ఫేస్ చేసిన ఘటనను అనిరుథ్ లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశాడు. వరదల కారణంగా నీటిలో కారు పూర్తిగా మునిగిపోయిందట. ఇంజిన్ పని చేయడం మానేసిందట. దీంతో వోక్స్‌వాగన్ సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకెళ్లానని.. దాదాపు 20 రోజుల తర్వాత తనకు ఎస్టిమేషన్ స్లిప్ ఇచ్చారని.. అందులో రూ.22 లక్షలు అవుతుందని సదరు సర్వీసింగ్ సెంటర్ పేర్కొనడంతో అవాక్కయ్యానని అనిరుథ్ తెలిపాడు. కారు విలువ చూస్తే రూ.11 లక్షలే.. దాని రిపేరుకు రూ.22 లక్షలంటే అవాక్కవని వారు ఎవరుంటారు చెప్పండి. రిపేర్ సెంటర్‌కు తీసుకెళ్లడానికి రూ.44,840 చెల్లించాలని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పడంతో మరోసారి ముక్కున వేలేసుకోవడం అనిరుథ్ వంతైంది. ఈ విషయమై వోక్స్ వ్యాగన్ సంస్థకు ఫిర్యాదు చేసినట్టు అనిరుథ్ తెలిపాడు. చివరకు రూ.5 వేలు చెల్లించి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించిందట. ఇదంతా చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.